తెలంగాణ

telangana

By

Published : Nov 29, 2020, 9:11 PM IST

ETV Bharat / jagte-raho

వరకట్న వేధింపులతో ఏవో అరుణ ఆత్మహత్య.. తండ్రి ఫిర్యాదు

మంజీర నదిలో దూకి చనిపోయిన ఏవో అరుణ... అత్తింటి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల క్రితం వివాహ సమయంలో అన్ని లాంఛనాలతో పెళ్లి జరిపించినప్పటికీ... అదనపు కట్నం కోసం ఇద్దరు అత్తలు, మామ, భర్త వేధించడం వల్లే మనస్థాపం చెందినట్టు ఆరోపించారు.

sangareddy agriculture officer aruna suicide with in laws family harassment
వరకట్న వేధింపులతో ఏవో అరుణ ఆత్మహత్య.. తండ్రి ఫిర్యాదు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ మండలం పైడిపల్లికి చెందిన అరుణ(34) అదనపు కట్నం వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి రైతు శిక్షణ కేంద్రంలో ఏవోగా పనిచేస్తున్నారు. గతంలో నారాయణఖేడ్, కల్హేర్ మండలాల్లో వ్యవసాయాధికారిణిగా పనిచేశారు. నాలుగేళ్ల క్రితం నాగల్​గిద్ద మండలం మోర్గి గ్రామానికి చెందిన శివకుమార్​తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు రుద్రవీర్‌(3), విరాట్‌(11 నెలలు) ఉన్నారు. సంగారెడ్డిలో నివాసముంటున్నారు.

గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వరకు విధులు నిర్వహించి... ఇంట్లో పని ఉందని కారులో బయల్దేరారు. అక్కడి నుంచి మనూరు మండలం రాయిపల్లి శివారులోని మంజీర నది వద్దకు వచ్చారు. ఆమె తమ్ముడు శివకుమార్‌కు ఫోన్‌ చేసి నదిలో దూకి చనిపోతున్నాని చెప్పారు. శివకుమార్ తిరిగి అదే నెంబర్​కు ఫోన్‌ చేస్తే... కలవకపోవడం వల్ల వంతెన వద్దకు వచ్చి గాలించారు. వంతెనపై కారు, పర్సు, ఫోన్‌, చెప్పులు ఉండటంతో మనూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మంజీరలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున పోలీసులకు గాలించడం కష్టంగా మారింది. ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని ఇవాళ గుర్తించారు. వివాహ సమయంలో అన్ని లాంఛనాలతో కట్నకానుకలు ఇచ్చారు. అయినప్పటికీ... మామ బస్వరాజ్, ఇద్దరు అత్తలు, భర్త, అదనపు కట్నం కోసం తరచూ వేధించేవారని... దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి నాగ్​శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు నెలలుగా అరుణ మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు సహోద్యోగలు, స్నేహితులు తెలిపారు.

ఇదీ చూడండి:మంజీరా నదిలో దూకి వ్యవసాయ శాఖ ఏవో ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details