నల్గొండ జిల్లా మునుగోడు మండలం గంగోరిగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పీజీ పూర్తి చేసి.. ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ యువకుడు కరోనా సమయంలో.. పాఠశాలలు నడవక.. అప్పుల భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గంగోరి గూడెం గ్రామానికి చెందిన మర్రి వెంకట్ నార్కట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా ప్రభావం వల్ల గత ఏడు నెలలుగా పాఠశాలలు మూతబడి.. వెంకట్ ఉపాధి కోల్పోయాడు. స్కూల్ నడవకపోవడం వల్ల యాజమాన్యం జీతాలు ఇవ్వలేదు. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అయినా.. ధైర్యం కోల్పోకుండా నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. వరుస వర్షాలతో పత్తి దిగుబడి సరిగ్గా రాలేదు. పంట కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక నిత్యం దిగులు పడేవాడు. ఎంఏ, బీఎడ్ పూర్తి చేసిన వెంకట్ ఇటు ఉద్యోగం లేక.. అటు చేసిన వ్యవసాయం దిగుబడి రాక.. అప్పులు తీర్చలేనేమో అన్న భయంతో పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి.. ప్రాణాలు విడిచాడు. వెంకట్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటికి పెద్ద దిక్కుగా నిలుస్తాడనుకున్న కుమారుడు చనిపోవడం వల్ల ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఉద్యోగం లేక పంట దిగుబడి రాక.. ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య - ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య
కరోనా వల్ల పాఠశాలలు మూతపడ్డాయి.. చేతిలో పని లేదు. ఉన్న డబ్బుుల అయిపోయాయి. పని కోసం బయటకు వెళ్లే పరిస్థితి లేదు. వెళ్లినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. మరోవైపు అప్పులు.. గుర్తొచ్చి భయపెట్టాయి. ఆత్మస్థైర్యం కోల్పోయాడు. ఏం చేయాలో తోచక.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ బాధాకరమైన ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలో చోటు చేసుకుంది.
రెక్కాడితే గానీ.. డొక్కాడని కుటుంబంలో పుట్టినప్పటికీ.. వెంకట్ చదువులో ముందుండేవాడు. అంతేకాదు.. మంచి రచయిత కూడా. సమాజాన్ని ఉద్దేశించి కవితలు, కథనాలు రాసేవాడు. తాను చనిపోతే తల్లిదండ్రులు, స్నేహితులు ఎంతో మనోవేదనకు గురవుతారని ఊహించి.. ముందుగానే తన మీద తానే.. ఓ పాట రాసుకున్నాడు. అందరితో కలిసి మెలిసి ఉండే వెంకట్ ఆత్మహత్యను గ్రామస్థులు సైతం జీర్ణంచుకోలేకపోతున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఆత్మహత్యల పాలైన ప్రైవేట్ ఉపాధ్యాయుడు వెంకట్‌ని ఆదుకోవాలని.. అతడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మరి కొంతమంది ప్రైవేట్ టీచర్లు ప్రాణాలు తీసుకోకముందే.. ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి:వరదలో పురిటి నొప్పులు- పడవలో కాన్పు