ప్రేమ వేధింపులు తట్టుకోలేక మైనర్ విద్యార్థిని గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన.. ఏపీలోని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో జరిగింది. మండలానికి చెందిన మారిశెట్టి మాధవరావు దంపతులు వ్యవసాయం చేస్తుంటారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె.. పాఠశాలకు వెళ్లి వచ్చే సమయంలో గ్రామానికి చెందిన భాను ప్రసాద్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. కొద్ది రోజులుగా వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో.. తట్టుకోలేక ఈనెల 13వ తేదీ ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు.. చికిత్స నిమిత్తం తొలుత సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
గ్రామానికి చెందిన భాను ప్రసాద్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతని వేధింపులు తట్టుకోలేక గడ్డి మందు తాగాను. నా మృతికి కారణమైన యువకుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. -బాధితురాలు