పోలీసు ఉన్నతాధికారులు సీవీ ఆనంద్, విజిలెన్స్ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని, వివిధ రకాల పనులు చేసి పెడతామని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను మహబూబ్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు కాగా... దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితులు మహబూబ్నగర్లో పట్టుబడ్డారు. హన్వాడకు చెందిన చంద్రశేఖర్... అతని సహచరులు దొమ్మరి రవి, మాదాసు బాలయ్య, మాదాసు తేజలను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు జక్కరయ్య పరారీలో ఉన్నాడు. వీరి నుంచి 2 సెల్ ఫోన్లు, 4 ద్విచక్రవాహనాలు, రెండు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
యూట్యూబ్లో చూసి నేర్చుకుని...
యూట్యూబ్లో ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ వీడియోలు చూసి... ఆయనలా మాడ్లాడటం నిందితులు అభ్యాసం చేశారు. పోలీసుశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఇతర పనులు చేసి పెడతామని ఫోన్లు చేసి బాధితులను నమ్మించేవారు. ఉన్నతాధికారే మాట్లాడుతున్నాడన్న భ్రమలో బాధితులు నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్లు. ఇలా మొత్తం రూ. 28లక్షల 8వేలు బాధితుల నుంచి తీసుకున్నారు. జల్సాలకు, విలాసాలకు డబ్బు ఖర్చు చేశారని పోలీసులు వెల్లడించారు.