రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామ శివారులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటబోయి గల్లంతైన వ్యక్తి నేడు శవమై తేలాడు. ఎడతెరపిలేకుండా కురుసిన వర్షానికి విశ్వనాథ్‌పూర్- తంగళ్లపల్లి మధ్య ఉన్న వాగు పోటెత్తింది. గ్రామానికి చెందిన జహంగీర్ (45) వాగు దాటేందుకు ప్రయత్నించగా... ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు.
వద్దన్నా వినలేదు... వాగు దాటబోయి విగతజీవిగా మారాడు
రోడ్డుపై నుంచి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎటు వాళ్లు అటే ఆగిపోయారు. కానీ... అతను మాత్రం వాగు దాటేందుకు ప్రయత్నించాడు. ఒడ్డున ఉన్న వాళ్లు వద్దని ఎంత చెప్పినా వినకుండా నీటిలో సగం దూరం వచ్చాడు. నీటి ప్రవాహానికి గల్లంతై... ముళ్లకంచెలో విగతజీవిగా కన్పించాడు.
ఘటన జరిగిన ప్రాంతానికి కిలోమీటరు దూరంలో తంగెళ్లపల్లి గ్రామ శివారులో వాగు ఒడ్డున ముళ్ల పొదల్లో జహంగీర్ మృతదేహం చిక్కుకుని ఉండటాన్ని స్థానికులు గమనించారు. మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
జహంగీర్... హైదరాబాద్‌లో మాంసం విక్రయాలు జరిపేవాడు. లాక్డౌన్ సమయంలో స్వగ్రామానికి వచ్చి ఊరూరా తిరుగుతూ మాంసం విక్రయాలు చేస్తున్నారు. శనివారం రోజు మధ్యం మత్తులో వున్న జహంగీర్... అక్కడున్నవారు ఎంత చెప్తున్నా వినకుండా... వాగు దాటబోయి ప్రాణాలు కోల్పోయాడు. జహంగీర్‌కు ఇద్దరు భార్యలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.