పురుగులమందు తాగి మైనర్ ప్రేమజంట ఆత్మహత్య - lovers suicide in Jangaon district
09:23 December 19
పురుగులమందు తాగి మైనర్ ప్రేమజంట ఆత్మహత్య
తెలిసి తెలియని వయసులో ప్రేమించుకున్నారు. ఒకటిగా జీవించాలి అనుకున్నారు. కానీ అమ్మాయి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటంతో.. వారి ప్రేమను ఇంట్లో ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. ఇక కలిసి బతకలేమని.. చావులోనైనా ఒకటవుదామనుకున్నారు. అర్ధరాత్రి పురుగుల మందు తాగి... ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని పాలకుర్తి ఎర్రమల్లయ్య కుంట సమీపంలో ఈ మైనర్ జంట ఆత్మహత్య చేసుకుంది. అబ్బాయి అంజి(17), అమ్మాయి శిరీషాల లక్ష్మి(16) కాగా.. వీరు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయికి ఇంట్లో సంబంధాలు చూస్తుండటంతో నిన్న రాత్రి ఇద్దరు కలిసి... ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. అర్ధరాత్రి పురుగులమందు తాగి ఇద్దరు బలవన్మరణం చెందారు. మృతులు జనగామ ఆసుపత్రిలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.