తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వారి దురాశ.. కుటుంబసభ్యులకు కన్నీటి గోస.. - murder cases in Telangana

సులభ మార్గంలో డబ్బు సంపాదించాలనే వారి ఆశ.. ఎన్నో కుటుంబాలకు తీరని దుఃఖాన్ని కలిగిస్తోంది. తల్లిదండ్రుల నుంచి డబ్బు గుంజాలనే దురాశతో వారి పిల్లలను అపహరిస్తూ.. చివరకు దొరికిపోతామేమోననే భయంతో వారి జీవితాల్ని చిదిమేస్తున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తూ చివరకు వారూ.. కటకటాలపాలవుతున్నారు. కిడ్నాప్​ చేసి వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బు గుంజడానికి ప్రయత్నించే వారి ఆగడాలు రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ తరహా నేరాలు తరచూ జరుగుతున్నాయి.

kidnaps and murder cases are increasing in Telangana
తెలంగాణలో అపహరణలు

By

Published : Oct 23, 2020, 9:44 AM IST

సులభంగా డబ్బు సంపాదించేందుకు కొందరు అపహరణ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. నగరంలో సంపన్నులు, వ్యాపారులు, వారి కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని కొన్నేళ్లుగా నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు చెబితే చంపేస్తామంటూ హెచ్చరిస్తుండటం వల్ల బాధితుల్లో కొందరు పోలీసులకు తెలియకుండా కిడ్నాపర్లు డిమాండ్ చేసిన డబ్బులు ఇస్తుండగా.. మరికొందరు ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. వారు నిందితులను పట్టుకుంటున్నా.. ఇలాంటి నేరాలు జరగడం మాత్రం ఆగడం లేదు.

దివికేగిన దీక్షిత్..

మహబూబాబాద్​లో చిన్నారి దీక్షిత్​ను అపహరించిన నందసాగర్.. పిల్లాడిని కిరాతకంగా హత్యచేశాడు. ఈ తరహా నేరాలు భాగ్యనగరంలోనూ జరుగుతున్నాయి. అపహరణకు గురైన కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు స్పందించి నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

వారం రోజుల్లోగా రూ.4కోట్లు.

కొంపల్లిలో నివాసముంటున్న ఎస్.రామకృష్ణరాజు నాచారం పారిశ్రామికవాడలో రసాయన పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ఆయన నుంచి కోట్లు దండుకోవచ్చన్న ఆలోచనతో డి.హరిప్రసాద్ అనే నిందితుడు తన స్నేహితులు మోహన్, శ్యాం, వరప్రసాద్, సంజీవ్, రాజశేఖర్​లతో కలిసి ఆగస్టు 27న రామకృష్ణరాజును అపహరించి.. మేడ్చల్ లోని ఓ గదిలో బంధించారు. రూ.4 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. తనవద్ద డబ్బు లేదని వారం రోజులు సమయం కావాలని కోరగా... బీకాంప్లెక్స్ మందును సిరంజీ ద్వారా శరీరంలోకి పంపించారు. అది విషమని.. వారం రోజుల్లో డబ్బు ఇస్తే.. విరుగుడు మందు ఇస్తామని..లేదంటే చస్తావని హెచ్చరించారు. ఆయన పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

హత్య చేసి గోనెసంచిలో మృతదేహం

ఇదే ఏడాది ఫిబ్రవరి 2న జూబ్లీహిల్స్​లో ఉంటున్న చేపల వ్యాపారి రమేశ్​ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. రమేశ్ చరవాణి పని చేయకపోవడం.. అతడు ఇంటికి రాకపోవడం వల్ల ఆయన కుటుంబసభ్యులు ఎస్.ఆర్.నగర్ పోలీసులకు అదృశ్యం అయినట్లు ఫిర్యాదు చేశారు. అనంతరం కిడ్నాపర్ ఫోన్ చేసి.. రూ.90లక్షలు ఇస్తే.. రమేశ్​ను వదిలేస్తామని హెచ్చరించారు. పోలీసులు పరిశోధన చేస్తుండగానే.. జవహార్ నగర్​లోని ఓ ఇంట్లో రమేశ్​ను హత్యచేసి గోనెసంచిలో మృతదేహాన్ని ఉంచి కిడ్నాపర్లు పారిపోయారు. అనంతరం పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

రూ.కోటి ఇస్తే వదిలేస్తాం

సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలు నిర్వహిస్తున్న గజేందర్ పారేక్​ను గతేడాది జులై 30న గుర్తు తెలియని వ్యక్తులు ఏవీ కళాశాల సమీపంలోని ఆయన దుకాణం వద్ద నుంచి అపహరించారు. రూ.కోటి ఇస్తే.. వదిలేస్తామంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. వారి కుటుంబసభ్యులు తొలుత రూ.30లక్షలు ఇస్తామంటూ చెప్పారు. రూ.30లక్షలు తీసుకున్న తర్వాత గజేందర్​ను వదిలేశారు. గాయాలతో ఉన్న గజేందర్​ను ఆసుపత్రిలో చేర్పించారు. కుటుంబసభ్యుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఊపిరాడక అభయ్ మృతి

శాహీనాయత్ గంజ్ పోలీస్ ఠాణా పరిధిలో తల్లిదండ్రులతో నివాసముంటున్న పదోతరగతి విద్యార్థి అభయ్ మోదానిని నాలుగేళ్లక్రితం అతని ఇంట్లో పనిచేసే ముగ్గురు యువకులు శేష్ కుమార్, రవి, మోహన్​లు అపహరించారు. రూ.10 కోట్లు ఇస్తే వదిలేస్తామంటూ ఫోన్ చేశారు. రూ.5 కోట్లు ఇస్తామని అభయ్ తండ్రి చెప్పారు. అతడిని అట్టపెట్టెలో దాచే క్రమంలో అభయ్ నోటికి ప్లాస్టర్లతో ముక్కు, నోటికి అతికించారు. శ్వాస అందక అభయ్ చనిపోవడం వల్ల అట్టెపెట్టెలోనే మృతదేహాన్ని ఓ ఆటో ట్రాలీతో తీసుకెళ్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై వదిలేశారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

వారి దురాశ.. వీరికి కన్నీటి గోస

ఈ తరహాలో నిందితులు.. కిడ్నాప్​కు పాల్పడి.. వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అహోరాత్రులు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు నిందితుల పాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు నగదు ఏర్పాటు చేసినా.. తమ కుటుంబ సభ్యున్ని ప్రాణాలతో దక్కించుకోలేక పోతున్నామని వాపోతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details