వైద్యుల నిర్లక్ష్యానికి మరో శిశువు బలైంది. ప్రభుత్వ ఆస్పత్రిలో సమయానికి కాన్పు చేయకపోవడంతో బిడ్డ కడుపులోనే మృతి చెందింది. నిర్మల్ జిల్లా భైoసా ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల లోకేశ్వరం మండలం మోడెమ్ గ్రామానికి చెందిన అక్షయకు గర్భశోకమే మిగిలింది. తొమ్మిది నెలలు నిండిన తర్వాత ప్రసవం కోసం భైంసా ఏరియా ఆస్పత్రిలో శనివారం చేరామని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. సాధారణ ప్రసవం అవుతుందని వైద్యులు శస్త్ర చికిత్స చేయకుండా ఆలస్యం చేశారని వాపోయారు. సోమవారం ఉదయం ఆపరేషన్ చేసి... అప్పటికే ఆ పసికందు చనిపోయి ఉందని వైద్యులు తెలిపారన్నారు.
ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి.! - తెలంగాణ తాజా వార్తలు
పండంటి బిడ్డకు జన్మనివ్వాలనుకున్న ఆ మహిళకు గర్భశోకమే మిగిలింది. తొమ్మిది నెలలు బిడ్డను మోసి.. ఆస్పత్రిలో చేరి రెండు రోజులు పురిటి నొప్పులను అనుభవించింది. కానీ విధి ఆమెను వక్రించింది. కడుపులోనే ఆ పసికందు మృతి చెందింది.
శిశువు కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న వారి కుటుంబ సభ్యులు బిడ్డ కడుపులోనే కన్నుమూసిందని తెలియడంతో కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిని నమ్ముకొని వస్తే తమ బిడ్డ ఈ లోకానికి రాకముందే అనంతలోకాలకు చేరిందని విలపించారు. ఆపరేషన్ చేయమని అడిగినా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని వాపోయారు. ప్రైవేటు ఆస్పత్రిలో వెంటనే స్పందిస్తారు కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు రోజుల నుంచి మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా చివరకు బిడ్డని చంపేశారని బాధితులు ఆరోపించారు.
ఇదీ చదవండి:పబ్లిక్ టాయిలెట్‌లో చెలరేగిన మంటలు..!