సూర్యాపేట జిల్లా ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ శిశువును బలితీసుకుంది. కాన్పు సమయంలో నిర్వహించిన ఆపరేషన్లో తలకు తగిలిన కత్తి గాటుతో శిశువు మృతి చెందింది. విధుల్లో ఉన్న వైద్యురాలు ఆపరేషన్ గదికి రాకుండానే కిందిస్థాయి సిబ్బందితో కాన్పు చేయించడంతోనే శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
తీరని శోకం...
పెళ్లైన ఐదేళ్ల తర్వాత తల్లినికాబోతున్నానని సంతోషంగా ఉన్న శ్రీలత అనే మహిళకు విషాదమే మిగిలింది. పెన్ పహాడ్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు శ్రీలత మొదటి కాన్పు కోసం సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిన్న ఉదయం చేరింది. మంగళవారం అర్ధరాత్రి ఆమెకు సాధారణ కాన్పు అవుతుందని చెప్పి ఆపరేషన్ గదిలోకి తీసుకెళ్లిన వైద్య సిబ్బంది, కొద్దిసేపటికి సాధారణ కాన్పు కావడంలేదని చిన్న ఆపరేషన్ చేస్తున్నామని చెప్పారని బంధువులు తెలిపారు. కాన్పు సమయంలో వైద్యురాలు రాలేదని బంధువులు పేర్కొన్నారు. సాధారణ కాన్పు తామే చేస్తామని చెప్పి... కింది స్థాయి వైద్య సిబ్బంది ఆమెకు కాన్పు చేశారని అన్నారు.