తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రాణాలు తీస్తున్న ఆన్​లైన్​ యాప్​ రుణాలు - ఆన్​లైన్​ యాప్​ రుణాలు

అడ్డు, అదుపు లేని ఆన్‌లైన్ యాప్‌ల వలకు చిక్కి.. అప్పులు తీర్చలేక కొందరు ప్రాణాలు తీసుకుంటుంటే... మరికొందరు తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నవారు. కరోనా ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు సామాన్యులు... జల్సాలు, వ్యసనాల కోసం కొందరు యువత ఈ ఊబిలో చిక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో అప్పులు ఇచ్చి ఒత్తిడికి గురి చేస్తే ఆయా యాప్‌లపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు దృష్టి సారిస్తున్నారు.

Harassing online loan apps in telangana
ప్రాణాలు తీస్తున్న ఆన్​లైన్​ యాప్​ రుణాలు

By

Published : Dec 19, 2020, 8:19 PM IST

కష్టకాలంలో డబ్బు అనే ఆశ చూపి... నెలలోనే 4నిండు ప్రాణాల్ని బలి తీసుకున్నాయి ఆన్‌లైన్‌ లోన్ యాప్‌లు. ఈ దారుణాల్ని నిలువరించేందుకు తెలంగాణ డీజీపీ కార్యాలయ అధికారులే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఆన్‌లైన్‌ యాప్‌లకు ఆర్‌బీఐ అనుమతి లేదని.. అందులో చాలా చైనాకు చెందిన యాప్‌లే ఉన్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో ఆయా యాప్‌లకు రిజిస్టర్‌ అయిన చిరునామాలు సరిగా లేవని తేల్చారు. ఆయా కేసులన్నింటినీ పరిశీలించి బాధ్యులైన యాప్‌ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సైబర్‌ క్రైం నిపుణులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆయా కేసుల్లో మృతుల సెల్‌ఫోన్ల నుంచి, కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వారంతా ఇన్‌స్టెంట్‌ యాప్‌ల వేధింపుల వల్లే మృతి చెందినట్లు కేసులు నమోదు చేశారు.

డౌన్​లోడ్​ చేసుకోవద్దు

రుణ యాప్‌ల్లో చాలావరకు ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధగా ఉన్నాయని, ఆర్బీఐ వద్ద నమోదు కాని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవొద్దని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి సూచించారు. ఇన్‌స్టెంట్‌ లోన్ల పేరుతో బురిడీ కొట్టించే యాప్‌ల్ని నమ్మి మోసపోవద్దని, ఆ యాప్‌ల నుంచి ఇప్పటికే రుణాలు పొందినవారు వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టిపరిస్థితుల్లో ఎవరికి ఇవ్వరాదని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్‌ కాంటాక్ట్స్‌, ఫోటోలు తీసుకుని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే యాప్‌ల ద్వారా అందించే రుణాల వడ్డీ రోజుకు ఒక శాతం వరకు ఉంటుంది. ఇది సాధారణంగా బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీ రిజిస్ట్రర్‌ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీలకన్నా చాలా ఎక్కువ. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ 2, 3 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 60 యాప్‌లు

ఇన్‌స్టెంట్‌ రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న పలు ఆన్‌లైన్‌ యాప్‌లపై ఫిర్యాదులు రావటంతో గూగుల్‌ప్లే స్టోర్‌ నుంచి వాటిని తొలగించారు. అయితే కొన్ని యాప్‌లు పేర్లను మార్చి మళ్లి ప్లే స్టోర్‌లోకి అప్‌లోడ్‌ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణతోపాటు, ఇటీవల ఏపీలో నమోదైన కేసుల్లో ఈ తరహా మోసాలు జరిగినట్లు గుర్తించారు. ఇన్‌స్టెంట్‌ లోన్‌ పేరుతో గూగుల్‌ ప్లేస్టోర్‌లో 60 యాప్‌లు ఉన్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. వీటిల్లో చాలా వాటికి ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీ నుంచి గుర్తింపు లేదు. యాప్‌ స్టోర్‌ నిబంధనల్నీ అతిక్రమిస్తున్నందున వాటిని తొలగించమని కోరేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే చట్టబద్ధత ఉన్న యాప్‌ల వివరాలు ఇవ్వాలని ఆర్బీఐకి పోలీసులు లేఖ రాశారు.

అర్బీఐ సర్క్యులర్​

2019 నవంబర్‌లో గూగుల్‌ సంస్థ లోన్‌ యాప్స్‌ విషయంలో కొన్ని నియమాలు విధించింది. 60 రోజుల లోపు కాల వ్యవధిలో తిరిగి చెల్లించాలని ఒత్తిడి తెస్తూ, భారీ మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్న యాప్స్‌ని సంబంధిత యాప్‌ డెవలపర్లు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ నిన్న మొన్నటి వరకూ అలాంటి యాప్స్‌ ప్లే స్టోర్‌లో కొనసాగుతూ వచ్చాయి. ఇటీవల గూగుల్‌ కొన్నింటిని గుర్తించి ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. మరోవైపు లోన్‌ యాప్‌లు.. రుణ గ్రహీతల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని ఉటంకిస్తూ...రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2020 జూన్‌ 24న కొన్ని విధి విధానాలతో ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. తమ దగ్గర ఆర్థిక సాయం పొంది... యాప్‌ల ద్వారా రుణం ఇచ్చే సంస్థల వివరాలు... ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వెబ్‌సైట్లలో స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించింది.

నకిలీ యాప్​లు

లోతుగా చేసిన అధ్యయనంలో భారత్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అధిక శాతం లోన్‌ యాప్‌లు చైనాకి చెందినవిగా గుర్తించారు. ఇవి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాలను బేఖాతరు చేస్తున్నాయి. కొన్ని యాప్‌లు భారతదేశానికి చెందిన మైక్రోఫైనాన్స్‌ యాప్‌ అయిన ఫ్లిప్‌కాష్‌ వంటి యాప్‌లకు నకిలీలుగా తేలింది. వాటిని ఇటీవల గూగుల్‌ సంస్థ ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. మన దేశంలో ఫిన్‌టెక్‌ కంపెనీలు పనిచేయాలంటే తప్పనిసరిగా నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉండాలి. సంబంధిత యాప్స్‌ ఆ మేరకు కొన్ని ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మన దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్‌ 45-1ఏ ప్రకారం ఏదైనా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ తగిన రిజిస్ట్రేషన్‌ అనంతరమే నిబంధనల మేరకు పనిచేయడానికి అనుమతి ఉంటుంది. ఆర్బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్‌ కాని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు చట్టబద్ధత ఉండదు. వాటికి రుణాలు అందించే అధికారమే లేదు.

న్యాయపోరాటం చేయాలి

అలాగే లోన్‌ యాప్‌లు కూడా తమకు ఆర్థికంగా వనరులు సమకూరుస్తున్న బ్యాంకుల సమాచారాన్ని రుణ గ్రహీతలకు తెలియజేయాలి. వినియోగదారులకు ఏర్పడే ఇబ్బందులను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న వ్యవస్థ గురించి అవగాహన కల్పించాలి. ఇందులో నియమ ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తప్పవని ఆర్బీఐ హెచ్చరించింది. అయినా నియమాలు ఉల్లంఘిస్తూ... రిజర్వ్‌ బ్యాంక్‌ కళ్లు గప్పుతూ... ఎప్పటికప్పుడు కొత్త లోన్ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇక ఈ లోన్ యాప్‌ల బెదిరింపులు, నోటీసులకు బాధితులు భయపడకుండా ధైర్యంగా న్యాయపోరాటం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మిత్రులు, బంధువులకు సమస్య గురించి వివరించాలని సలహా ఇస్తున్నారు. వేధింపులకి గురి చేస్తున్నట్లు ఆధారాలను సేకరించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం మంచిదంటున్నారు.

ఇదీ చదవండి:సికింద్రాబాద్​లో‌ రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details