లాక్‌డౌన్ నేపథ్యంలో కాలినడకన స్వస్థలానికి వెళుతూ మార్గమధ్యలో వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
విషాదం... గమ్యం చేరని 'వలస' ప్రయాణం - latest crime news in peddapalli
సొంత వారిని చూడాలని బయలుదేరిన ఆ ప్రాణం మధ్యలోనే ఆగిపోయింది. గమ్యాన్ని చేరుకోకుండానే ప్రయాణాన్ని ముగించింది. ఆకలి దప్పికలకు ఓర్చి నడక సాగించిన అతడు చివరికి విధి కాటుకు బలయ్యాడు.
వరంగల్‌లో పెయింటర్, సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న పరదేశ్ మండల్ లాక్‌డౌన్ కారణంగా పనులు లేక రెండ్రోజులుగా రైలుపట్టాల వెంట స్వస్థలం సిర్పూర్ కాగజ్‌నగర్‌కు కాలినడకన వెళ్తున్నాడు. బుధవారం పొత్కపల్లికి చేరుకున్నాడు. ఆకలితో అలమటిస్తున్న అతనికి స్థానిక నాయకుడొకరు ఆహారాన్ని అందించారు. అనంతరం రాత్రి పూట రైల్వేస్టేషన్‌లో నిద్రించారు. గురువారం స్టేషన్ సమీపంలో మృతదేహం ఉందని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు తెలిపారు. అక్కడికి వెళ్లి పరిశీలించిన రైల్వే పోలీసులు కడుపునొప్పి, వడదెబ్బ కారణంగా మృతిచెంది ఉంటాడని భావించి.. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మరోవైపు ఓదెల తహసీల్దార్ సి.రామ్మోహన్ దీనిని అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.
ఇదీ చూడండి:ప్రైవేట్ ఆస్పత్రుల సేవలను ఏ విధంగా వాడుతున్నారు: హైకోర్టు