బహుళ అంతస్తుల నిర్మాణాలకు అవసరమైన సిమెంటు, స్టీల్, ఇటుకలు, కలప, ఇంటీరియర్ డిజైన్ వస్తువులు కావాలంటూ సామగ్రిని తీసుకుని మోసం చేశాడంటూ బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. తమ నుంచి 25 కోట్ల సామగ్రి సమకూర్చుని డబ్బు ఇవ్వకుండా రాజస్థాన్ వ్యాపారి జైన్ మోసం చేశాడని బాధితులు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇస్తానని నమ్మించిన జైన్.. వారం రోజుల క్రితం అతను నిర్వహిస్తున్న నాలుగు దుకాణాలకు తాళాలు వేసి పారిపోయాడు. పలుమార్లు ఫోన్లు చేసినా స్విచ్ఛాఫ్ అని రావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
మోసం: నమ్మించి 25 కోట్ల సామగ్రితో పరార్ - Hyderabad crime news
బహుళ అంతస్తుల నిర్మాణాలకు అవసరమైన సామగ్రి కావాలంటూ... తీసుకుని పరార్ అయిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. దీనిపై బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
లాక్ డౌన్ సమయంలో భవన నిర్మాణాలు మందకొడిగా కొనసాగడం, వస్తువులు , సామగ్రికి గిరాకీ లేకపోవడంతో జైన్ చెప్పిన మాటలు నమ్మి అతడు కోరినంత సరుకును సమకూర్చామని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌కు చెందిన అశోక్ జైన్ ఏడాది క్రితం బోయిన్‌పల్లిలో భవన నిర్మాణ సామగ్రి విక్రయం పేరుతో హోల్ సేల్ దుకాణాన్ని ప్రారంభించాడు. సిమెంట్, స్టీల్‌తో పాటు ప్లైయాష్ ఇటుకలు, ప్లంబింగ్ పరికరాలను విక్రయించేవాడు. కూకట్‌పల్లి, జీడిమెట్ల, కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో నిర్మాణాలు జరుగుతున్న చోట్లకు వెళ్లి అక్కడ బిల్డర్లను పరిచయం చేసుకుని హోల్ సేల్ ధరలకే రవాణా చేస్తానంటూ చెప్పేవాడు. వారితో ఒప్పందం కుదుర్చుకున్నాక నగరంలోని హోల్‌సేల్ వ్యాపారుల వద్దకు వెళ్లి వారం రోజుల్లో డబ్బు ఇస్తానంటూ సిమెంట్, స్టీల్ తెచ్చుకునేవాడు.
ప్రాజెక్టులతో ఒప్పందం కుదుర్చుకున్నానంటూ వ్యాపారులకు చెప్పి జగద్గిరిగుట్ట, సుచిత్ర, మేడ్చల్‌లోనూ దుకాణాలను ప్రారంభించాడు. కరోనా ప్రారంభమయ్యాక వ్యాపారాలు అంతగా లేకపోవడంతో జైన్ తన మోసానికి తెరలేపాడు. పెద్ద కాంట్రాక్టులకు కూడా సిమెంట్, స్టీల్ సరఫరా చేస్తున్నానని చెప్పి రెండున్నర నెలల్లో 20 మంది వ్యాపారుల నుంచి 25 కోట్ల విలువైన సరుకు సమీకరించుకున్నాడు. సరుకు తీసుకున్నా.. డబ్బు ఇవ్వలేవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.