భూ తగాదాల నేపథ్యంలో తండ్రి, కొడుకులపై అందరూ చూస్తుండగానే దాయాదులు దాడికి పాల్పడగా... తండ్రి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని నాంపల్లి మండలం బండతిమ్మాపురం పంచాయతీ పాటిమీదిగూడెం ఆవాస గ్రామంలో జరిగింది. బోదాసు వెంకటయ్య (56)కు, దాయాదులకు మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రోజు పొలం వద్ద ఉన్న వెంకటయ్య కుమారుడు బోదాసు అశోక్‌పై దాయాదులైన బోదాసు కృష్ణయ్య, అతని కుమారులు విజయ్, నాగరాజు, గిరయ్య, వెంకటయ్యలు దాడి చేశారు. వారి నుంచి తప్పించుకున్న అశోక్ పరుగెత్తుకుంటూ గ్రామంలోకి వచ్చాడు. దాయాదులు అతడిని తరుముకుంటూ వస్తుండగా... గ్రామంలో తండ్రి వెంకటయ్య తారసపడ్డారు. వెంటనే అశోక్‌ను వదిలిపెట్టి ఆయనపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
దారుణం: పట్టపగలు.. ప్రాణం తీసిన పగలు - latest crime news in nampally
ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న భూ తగాదాలు... రక్తం కళ్లచుశాయి . వారి మధ్య చెలరేగిన పగలు... పట్టపగలే ప్రాణాలు తీసుకునేలా చేశాయి. అందరూ చూస్తుండగానే... దాడులు చేసుకుని విచక్షణారహితంగా కర్రలు, రాళ్లతో చావబాదిన ఘటన హైదరాబాద్ జిల్లా నాంపల్లి మండలం పాటిమీదగూడెంలో జరిగింది.
ఈ దారుణాన్ని గ్రామంలోని కొందరు చూసినా... అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్య సుమారు రెండు గంటలసేపు గాయాలతో రోడ్డుపక్కనే నరకయాతన అనుభవించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చేవరకు ఆయన గాయాలతో ఎండలోనే ఉండిపోయారు. నిందితులు ఆ సమీపంలోనే ఉండడం వల్ల భయంతో అశోక్ కూడా తండ్రి దగ్గరకు వెళ్లలేకపోయాడు. మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలు చిత్రీకరించిన వ్యక్తులైనా... కనీసం 108కు ఫోన్ చేయలేదు.
సుమారు రెండు గంటల తర్వాత అక్కడకు చేరుకున్న పోలీసులు మొదట నిందితులను, తర్వాత గాయాలతో ఉన్న బాధితుణ్ని పలు ప్రశ్నలు అడిగి విచారించిన అనంతరం అంబులెన్స్‌ను రప్పించి వెంకటయ్యను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క్షతగాత్రుడు మృతి చెందాడు. గ్రామంలో పట్టపగలే జరిగిన దాడి వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి.