ఏపీలోని గుంటూరు అలీనగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని నజీమా అదృశ్యం కేసు విషాదాంతంగా మిగిలింది. 2018 మే 25న వివాహానికి వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరింది. ఆపై మళ్లీ ఇంటికి రాలేదు. ఆమె కోసం తల్లిదండ్రులు కరీముల్లా, తల్లి మీరా బీ, బంధువులు గాలించి విఫలమై... చివరకు పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొన్నాళ్లు వెతికిన తర్వాత పోలీసులు కేసును పక్కన పెట్టేశారు. తమ బిడ్డ ఏమైందోనని ఆందోళనతో ఆ కన్నవారు నిద్రలేని రాత్రులు గడిపారు. ఏనాడైనా కంటికి కనిపిస్తుందని ఆశతో ఎదురుచూపులు చూశారు. గాలిస్తూనే ఉన్నామని పోలీసులు చెప్పేవారు. ఇలా రెండున్నరేళ్లు భారంగా గడిచిపోయాయి.
తేలింది ఇలా...
ఇన్నాళ్ల తరువాత వచ్చిన ఓ కీలక సమాచారంతో పెండింగ్ మిస్టరీ కేసు విషయాన్ని గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. స్పందించిన ఐజీ వెంటనే విచారణకు ఆదేశించారు. ఆమెతో సన్నిహిత సంబంధాలున్నట్లు అనుమానించిన పోలీసులు... షేక్ కరీమ్ అలియాన్ నాగూర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గట్టిగా నిలదీయడంతో హత్యోదంతం బయటపడింది.
ఈ కథే ఘోరానికి కారణం
నజీమా, షేక్ కరీమ్.. కళాశాలలోనే ప్రేమించుకున్నారు. శారీరకంగా దగ్గరయ్యారు. ఈలోగా ఇద్దరి మధ్య అనుమానాలు, అభిప్రాయభేదాలు తలెత్తాయి. కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. వేరొకరితో నజీమా చనువుగా ఉందనే అనుమానం పెంచుకున్న నాగూర్... ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. ఆమె ఒత్తిడి చేయడంతో... చివరకు ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఒకరోజు ఇద్దరూ కలుసుకున్నారు. అక్కడా నజీమా పెళ్లి ప్రస్తావన తేవడం, చిన్నపాటి గొడవ తలెత్తడంతో ఆగ్రహంతో నజీమా గొంతు నులిమేశాడు.. గోడకేసి కొట్టి హత్య చేసినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు.