తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఒక్కొక్కటిగా బయటపడుతున్న కీసర తహసీల్దారు అవినీతి కార్యకలాపాలు - medchal malkajgiri district crime news

కీసర మండలం రాంపల్లి దాయరలో భూములకు నకిలీ పట్టాలు ఇచ్చిన కేసులో అనిశా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో తహసీల్దార్ నాగరాజు భారీగా లంచం తీసుకున్నట్లు అనుమానిస్తున్న అధికారులు ఆ దిశగా ఆధారాలు సేకరిస్తున్నారు. గ్రామంలోని వివాదాస్పద భూమికి రూ. కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన నాగరాజు.. నకిలీ పట్టాల జారీలోనూ అంతకంటే ఎక్కువ మొత్తంలోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

acb investigating keesara mro nagaraju bribe case
ఒక్కొక్కటిగా బయటపడుతున్న కీసర తహసీల్దారు అవినీతి కార్యకలాపాలు

By

Published : Oct 2, 2020, 8:09 PM IST

Updated : Oct 2, 2020, 9:30 PM IST

వివాదాస్పద భూమి విషయంలో స్థిరాస్తి వ్యాపారులు అనుకూలంగా వ్యవహరించేందుకు రూ. కోటి 10 లక్షలు లంచం తీసుకున్న కీసర తహసీల్దార్ నాగరాజు అవినీతి లీలలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. రాంపల్లి దాయరలోనే మరో 24 ఎకరాల భూమికి నకిలీ పాసు పుస్తకాలు జారీ చేసి దాదాపు రూ. 2 కోట్ల వరకు లంచం తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మాజీ తహసీల్దార్ నాగరాజుతో పాటు ధర్మారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశ్, స్థిరాస్తి వ్యాపారులు వెంకటేశ్వర్ రావు, జగదీశ్, భాస్కర్ లను అనిశా అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

వివాదాస్పద భూమి ఒక్కటే కాదు..

పదేళ్ల కిందట గ్రామంలోని పలు సర్వే నంబర్లలో ఉన్న సుమారు 96 ఎకరాల భూమి తమదేనంటూ ధర్మారెడ్డి, అతని సోదరులు తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టాలు తెచ్చుకున్నారు. దీంతో గత 60 ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్న రైతులు తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను కీసర ఆర్డీఓకు సమర్పించారు. ప్రస్తుతం భూమికి సంబంధించి రెవెన్యూ పరంగా దర్యాప్తు జరుగుతోంది. ఆర్డీఓ వద్ద కేసు పెండింగ్​లో ఉన్నా.. ధర్మారెడ్డి నుంచి నాగరాజు భారీగా డబ్బులు తీసుకొని నకిలీ పట్టా పాసు పుస్తకాలు జారీ చేశాడు.

రాంపల్లి దాయరలోని పలు సర్వే నంబర్లలో ఉన్న దాదాపు 24 ఎకరాల భూమికి నాగరాజు డిజిటల్ సంతకాలు చేసినట్లు అనిశా గుర్తించింది. విజిలెన్స్ దర్యాప్తులో నకిలీ పాసు పుస్తకాల విషయం బయటపడటంతో ప్రభుత్వం అనిశాను దర్యాప్తుకు ఆదేశించింది. నకిలీ పట్టాలు సృష్టించిన భూమి విలువ ప్రభుత్వం ప్రకారం రూ. రెండున్నర కోట్లకు పైగా ఉంటే మార్కెట్ ప్రకారం దాదాపు రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా. నకిలీ పట్టాలు ఇవ్వడానికి నాగరాజుకి ధర్మారెడ్డి రూ. 2 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు అనిశాకు సమాచారం అందింది. డబ్బును నగదుగా తీసుకున్నాడా లేక భూమి విక్రయం జరిగిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ధర్మారెడ్డితో పాటు స్థిరాస్తి వ్యాపారి వెంకటేశ్వర్​రావును అధికారులు ప్రశ్నించారు.

కేసు వివరాలిలా..

వివాదాస్పద భూమిని స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా మలిచేందుకు తహసీల్దార్ నాగరాజు రూ. కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ ఆగస్టు 14వ తేదీన పట్టుబడ్డాడు. ఆ కేసులోనే ప్రస్తుతం నాగరాజు చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి, శ్రీనాథ్ వీఆర్ఏ సాయిరాజ్ బెయిల్​పై బయటికి వచ్చారు. కీసర ఆర్డీఓతో పాటు జిల్లా ఉన్నతస్థాయి అధికారి సూచించినందుకే అంజిరెడ్డి, శ్రీనాథ్​తో సమావేశమయ్యానని నాగరాజు అనిశా అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అంతకు ముందే జూలై 9 న ధర్మారెడ్డి, ఆయన బంధువుల పేరిట 24 ఎకరాలకు నకిలీ పట్టా పుస్తకాలను నాగరాజు జారీ చేశాడు. ఇలా అతను ఎంత మందితో కుమ్మక్కై భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

నాగరాజును మరోసారి కస్టడీలోకి తీసుకుంటే నకిలీ పట్టా పాసు పుస్తకాలకు సంబంధించి పురోగతి వస్తుందని అనిశా అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి: జేపీ

Last Updated : Oct 2, 2020, 9:30 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details