అనిశా అధికారులకు పట్టుబడిన రంగారెడ్డి జిల్లా షాబాద్ సీఐ శంకరయ్యపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దుండిగల్ ఇన్స్పెక్టర్గా పని చేసినప్పుడు భూ వివాదంలో తలదూర్చినట్లు అభియోగాలున్నాయి.
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డితో కలిసి భూ వివాదాలు పరిష్కరించినట్లు సీఐ శంకరయ్యపై ఆరోపణలు ఉన్నాయి. చిగురుపాటి జయరాం, ఆయన మేనకోడలు శ్రీఖ ఫోన్ కాల్స్ వివరాలను నిబంధనలకు విరుద్ధంగా సేకరించి అప్పట్లో రాకేశ్ రెడ్డికి ఇచ్చినట్లు అధికారులకు సమాచారం ఉంది.
ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏడాదిన్నర క్రితమే శంకరయ్యను దుండిగల్ నుంచి బదిలీ చేసి సీపీ ఆఫీస్కు అటాచ్ చేశారు. దాదాపు 9 నెలల తర్వాత షాబాద్ సీఐగా బదిలీపై వెళ్లారు. భూమికి రక్షణ కల్పించడానికి యజమాని నుంచి లక్షా ఇరవై వేలు లంచం తీసుకుంటూ రెండు రోజుల క్రితం సీఐ శంకరయ్యతో పాటు ఏఎస్ఐ అనిశా అధికారులకు దొరికారు.
శంకరయ్య ఇల్లు, బంధువుల నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నాలుగున్నర కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టు అనిశా దర్యాప్తులో తేలింది. శంకరయ్య ఆస్తులకు సంబంధించి అనిశా అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి :అ.ని.శా. వలలో చిక్కిన షాబాద్ సీఐ, ఏఎస్‌ఐ