ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేస్తున్న అవినీతి తిమింగలాలపై అనిశా అధికారులు కొరడా ఝళిపిస్తుంటారు. ముఖ్యంగా వీరి లిస్టులో రెవెన్యూ అధికారులు ముందు వరుసలో ఉంటారు. గత కొంత కాలంగా తహసీల్దార్ల స్థాయిలో ఉన్న అధికారులే రంగంలోకి దిగి అవినీతికి పాల్పడుతున్నారు. జూన్ 5న బంజారాహిల్స్‌లో కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఖలీద్ అనే వ్యక్తికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చేందుకు 15 లక్షల లంచం తీసుకుంటూ షేక్‌పేట ఆర్ఐ నాగార్జున రెడ్డి అనిశాకు చిక్కాడు.
తహసీల్దార్ భర్త ఆత్మహత్య
ఈ కేసులో భాగంగా తహసీల్దార్ సుజాత ఇంట్లో తనిఖీ చేయగా 30 లక్షల నగదు, బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. వీరితో పాటు బంజారాహిల్స్ ఎస్సై రవీందర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా సుజాత భర్త అజయ్ కుమార్‌ను విచారించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయన.. జూన్ 17న ఉదయం చిక్కడపల్లిలోని తన చెల్లెలి ఇంటికి వెళ్లి ఐదు అంతస్తుల భవనం మీది నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అజయ్ కుమార్ సోదరి ఆరోపించారు.
బెయిల్‌కు నిరాకరించిన కోర్టు
కోటి పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన నాగరాజు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అతన్ని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాగరాజుతో పాటు స్థిరాస్తి వ్యాపారులు శ్రీనాథ్, అంజి రెడ్డి, వీఆర్ఏ సాయి రాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. దయారా గ్రామంలో 48 ఎకరాల విలువైన భూమికి నకిలీ పత్రాలు సృష్టించి.. మ్యుటేషన్ చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏసీబీ అధికారులు మాజీ తహసీల్దార్‌తో పాటుగా 9 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసుల్లో నిందితులు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. నాగరాజుకు బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉండటంతో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.