సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఎం.రామచంద్రం అనే కార్పెంటర్ మృతి చెందాడు.
వర్గల్ మండల కేంద్రానికి చెందిన ఎం.రామచంద్రం, సువర్ణ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు. ఇద్దరు కుమార్తెలు ఇంజినీరింగ్ చదువుతున్నారు. కార్పెంటర్ పని బాగా చేయగలడనే పేరున్న రామచంద్రానికి లాక్‌డౌన్ కాలం శాపంగా మారింది. గిరాకీలు లేకపోవడంతో గజ్వేల్‌లో ఉన్న దుకాణాన్ని మూసేశాడు.
అంతలోనే ఆయనకున్న అరెకరా భూమిలో కొంత భాగాన్ని కాళేశ్వరం కాలువల నిర్మాణం కోసం సేకరిస్తున్నట్టు ఇటీవలే భూసేకరణ ప్రకటన వెలువడింది. ఈ పరిణామాలన్నీ ఆయన్ని మానసికంగా కుంగదీశాయి. వృత్తిపని నడవని పరిస్థితుల్లో పిల్లల చదువులు కొనసాగించడం ఎలా? వారికి పెళ్లిళ్లు చేయడమెలా! అనే ఆలోచనలు బతకాలనే ఆయన ఆశను క్రమంగా చంపేస్తూ వచ్చాయి. ఇదే అభిప్రాయాన్ని పదిహేను రోజులుగా భార్య, తమ్ముడి వద్ద వ్యక్తం చేస్తుండటంతో వారు ఆయనకు కాపలా కాస్తున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం రహస్యంగా పొలం వద్దకెళ్లిన ఆయన.. ముందుగా అక్కడున్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. విద్యుదాఘాతంతో గాయపడి దూరంగా ఎగిరిపడ్డాడు. అయినా ప్రాణం పోకపోవడంతో వెంటనే ఉరేసుకున్నాడు. అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
ఇదీచూడండి: అప్పుడే పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే అనంత లోకాలకు..