విపత్తు వేళ సాటి మనుషులను ఆదుకోవాలంటూ విరాళాలివ్వాలని.. మందు పార్టీలకు అవసరమైన మద్యాన్ని ఇంటికే తీసుకొస్తామంటూ కొందరు ఫోన్లు చేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్‌లలో ప్రకటనలిస్తున్నారు. స్పందించిన వారి నుంచి నగదు బదిలీ చేసుకుంటున్నారు.
సామాజిక మాధ్యామాల్లో ప్రకటనలు..
ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలంటూ సైబర్ నేరస్థులు పీఎంకేర్స్ పేరుతో నకిలీ యూపీఐలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్‌లలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. యూపీఐలను స్పష్టించిన సైబర్ నేరస్థుల్లో ఒకరు హైదరాబాద్ యువకుడు అఖిల్‌గా పోలీసు అధికారులు గుర్తించారు. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే... ఇంటికే మద్యం అందజేస్తామంటూ రాజస్థాన్, బిహార్‌కు చెందిన నేరస్థులు ఇప్పటికే లక్షల్లో నగదు బదిలీ చేసుకున్నారు. మందుబాబులు తమ ప్రకటనలను నమ్మేందుకు వీలుగా స్థానికంగా ఉన్న మద్యం దుకాణాల పేర్లు పోస్ట్ చేస్తున్నారు.
లాక్‌డౌన్‌ను పొడిగిస్తారంటూ..
వీటితో పాటు నెలవారీ ఈఎంఐలు ఎలా వాయిదా వేసుకోవాలో సంప్రదించాలంటూ ఈ-మెయిళ్లు పంపుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒక వర్గానికి వ్యతిరేకంగా కొందరు సామాజిక మాధ్యామాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని పరిశీలించిన సల్మాన్ ఖాన్ అనే యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ ప్రబలుతుందని కొందరు వీడియోలను యూట్యూబ్‌లో ఉంచారు. లాక్‌డౌన్‌ను కూడా మే 4 వరకు పొడిగిస్తారంటూ మరికొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.