తెలంగాణ

telangana

ETV Bharat / international

సంఘర్షణ ముగిసినా.. వారి కన్నీళ్లు ఆగలేదు! - air strikes

పాలస్తీనా హమాస్​ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్​ సైన్యం పరస్పర దాడులతో.. గాజా నగరం నిలువెల్లా గాయాలతో నెత్తురోడింది. భారీ భవనాలు ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా శిథిలాలే దర్శనమిస్తున్నాయి. కాల్పుల విరమణకు ఇరు వర్గాలు అంగీకారం తెలిపినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ దాడులు ఎందరికో కన్నీటి గాథను మిగిల్చాయి. ఆత్మీయులను కోల్పోయిన వారు ఆర్తనాదాలు పెడుతున్నారు. వ్యాపార కార్యకలాపాలూ ఆగిపోయాయి.

ISRAEL-GAZA CONFLICT
సంఘర్షణ ముగిసినా.. వారి కన్నీళ్లు ఆగలేదు!

By

Published : May 22, 2021, 8:40 PM IST

ఇజ్రాయెల్​ దాడులతో గాజా అతలాకుతలం

హమాస్​ ఉగ్రవాదులే లక్ష్యంగా.. ఇజ్రాయెల్​ జరిపిన దాడులకు గాజా చిగురుటాకులా వణికిపోయింది. 11 రోజుల భీకరపోరులో సమిధలో మారిన గాజా.. పూర్వవైభవం పొందేందుకు కొట్టుమిట్టాడుతోంది.

వైమానిక దాడులతో.. గాజాలో బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసం అయ్యాయి. రోడ్ల నిండుగా భారీ ఎత్తున శిథిలాలు పేరుకుపోయాయి. చివరికి ఈజిప్టు, అమెరికా దౌత్యంతో.. సంఘర్షణ ఆగినా గాజాలో పరిస్థితులు ఇప్పట్లో మారేలా లేవు.

ముఖ్యంగా గాజాలో నిత్యం రద్దీగా ఉండే.. వాణిజ్య సముదాయంలో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. వారు తమ కార్యకలాపాలను పునఃప్రారంభించాలంటే రోజులు పట్టేలా ఉంది.

దుమ్మూధూళితో నిండిన దుస్తులు

వస్త్ర దుకాణాల్లో బట్టలు దుమ్మూ ధూళితో చిందరవందరగా పడిఉన్నాయి. వాటిని ఎలా విక్రయించాలని దుకాణాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని రకాల వ్యాపారాలపైనా పెద్ద దెబ్బే పడింది. చేసేదేమీ లేక తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు గాజా వాసులు.

శిథిలాలను తొలగిస్తున్న వ్యాపారులు
చిందరవందరగా సామగ్రి

తాగడానికి నీరే లేదు..

ఇజ్రాయెల్​ దాడులతో గాజాలోని నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. దాదాపు 8 లక్షల మందికిపైగా గాజా వాసులకు.. తాగడానికి సరైన మంచి నీరే లేదని అంచనా వేసింది.

ఆత్మీయులను కోల్పోయి..

ఇజ్రాయెల్​ దాడుల్లో గాజాలోని వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సొంతవారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారిని ఓదార్చడం ఎవరివల్లా కావట్లేదు. ఈద్​ రోజు సంతోషంగా గడపాల్సిన ఓ కుటుంబానికి.. ఇజ్రాయెల్​ దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తన భార్య, పిల్లలు, బంధువులు సహా ఒకే భవనంలోని 10 మంది మరణంతో అబూ హతాబ్​ కుమిలిపోతున్నాడు. తన కూతురు మారియాతో బయటకు వెళ్లి వచ్చేలోపే భవనం ధ్వంసమైందని ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకున్నాడు.

ధ్వంసమైన భవనం
బాధలో తండ్రీకూతురు

ఇదీ చూడండి: హగ్స్​, షేక్​హ్యాండ్స్​తో శ్వేతసౌధం​లో మళ్లీ పాతరోజులు

ABOUT THE AUTHOR

...view details