తెలంగాణ

telangana

'రష్యాతో ఒప్పందానికి సిద్ధం.. నాటో ప్రయత్నాలు విరమిస్తాం!'

By

Published : Mar 23, 2022, 6:36 AM IST

Russia Ukraine War: యుద్ధాన్ని రష్యా విరమించేటట్లయితే నాటోలో సభ్యత్వ ప్రయత్నాలను తాము విరమించుకునే అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేరుగా చర్చలు జరగాలన్న డిమాండ్​ను ఆయన పునరుద్ఘాటించారు.

Russia Ukraine War
Zelensky

Russia Ukraine War: రష్యాతో ఒప్పందంపై చర్చించడానికి తాము సిద్ధమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. యుద్ధాన్ని రష్యా విరమించేటట్లయితే నాటోలో సభ్యత్వ ప్రయత్నాలను తాము విరమించుకునే అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంగళవారం ఉక్రెయిన్‌ టీవీ ఛానళ్లకు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేరుగా చర్చలు జరగాలన్న డిమాండ్​ను పునరుద్ఘాటించారు. అది జరగనిదే ఈ యుద్ధాన్ని రష్యా ఆపాలనుకుంటున్నదీ లేనిదీ అర్థం చేసుకోవడం అసాధ్యమని తేల్చిచెప్పారు.

క్రిమియా స్థితిపైనా, రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదుల నియంత్రణలోని తూర్పు డాన్‌బాస్‌ ప్రాంతంపైనా చర్చకు సంసిద్ధత వ్యక్తం చేశారు జెలెన్​స్కీ. తమపై దాడిని విరమించడం సహా భద్రతపరమైన హామీలను ఇచ్చినట్లయితే ఇవన్నీ జరుగుతాయని స్పష్టంచేశారు. వివిధ దేశాల చట్టసభ సభ్యులతో మాట్లాడుతున్న జెలెన్‌స్కీ ఆ క్రమంలో ఇటలీ ఎంపీలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించారు. మనుగడ కోసం తాము యుద్ధం చేస్తున్నామనీ, తమను జయించడం ద్వారా ఐరోపాకు ప్రవేశమార్గాన్ని ఏర్పరచుకోవాలనేది రష్యా ప్రయత్నమని చెప్పారు. రెండు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా పోప్‌ ఫ్రాన్సిస్‌ను కోరారు. సహాయ కారిడార్లను సయితం రష్యా అడ్డుకుంటోందని, సంక్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయని పోప్‌నకు వివరించినట్లు ఆయన ట్వీట్‌ చేశారు.

అమెరికా ఆందోళన

ఉక్రెయిన్‌పై రసాయన, జీవ ఆయుధాలను పుతిన్‌ ప్రయోగించవచ్చన్న ఆందోళనను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వ్యక్తంచేశారు. ఈ మేరకు గట్టి హెచ్చరిక జారీచేశారు. ఉక్రెయిన్‌ వద్ద జీవ, రసాయన ఆయుధాలు ఉన్నాయంటూ పుతిన్‌ చెబుతున్న మాటలు వాస్తవం కాదన్నారు. నిజానికి ఆ రెండింటినీ ఆయన ప్రయోగించబోతున్నారని చెప్పడానికి ఇవి స్పష్టమైన సూచికలని చెప్పారు.

.

పట్టు కోసం పోరాటం

కీవ్‌ శివార్లలోని వ్యూహాత్మక ప్రాంతాలను రష్యా నియంత్రణ నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. గట్టి ప్రతిఘటన తర్వాత ఇది సాధ్యమైందని వివరించింది. ఈ ప్రాంతం తమ వశం కావడంతో కీలకమైన జాతీయ రహదారి మీదుగా రష్యా సేనల పయనాన్ని అడ్డుకునేందుకు, తద్వారా వాయవ్య దిశ నుంచి కీవ్‌ను అవి చుట్టుముట్టకుండా నిలువరించడానికి ఉక్రెయిన్‌కు అవకాశం లభించింది. మేరియుపొల్‌పై పట్టు కోసం రష్యా సేనలు ముమ్మరంగా ప్రయత్నించాయి. ఆ క్రమంలో పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. రాజధాని కీవ్‌లోనూ ఇదే పరిస్థితి.

నామరూపాల్లేని మేరియుపొల్‌

రష్యా దాడుల్లో మేరియుపొల్‌ నగరంలో 99% మేర ధ్వంసమైపోయిందని అక్కడి నుంచి పోలండ్‌కు వలసవచ్చిన విక్టోరియా తోత్సెన్‌ తెలిపారు. మూడు వారాలుగా కురిసిన బాంబుల వర్షం దీనికి కారణమని చెప్పారు. గత ఐదు రోజుల్లోనైతే విమానాలు కుంభవృష్టి తరహాలో బాంబుల్ని జారవిడిచాయని, దాదాపు ఏ భవనమూ అక్కడ మిగల్లేదని వివరించారు.

బ్రిటన్‌ ప్రధానితో మాట్లాడిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఉక్రెయిన్‌ యుద్ధంపై కూలంకషంగా చర్చించారు. పోరు ఆపాలని, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్‌ పదేపదే విజ్ఞప్తి చేసిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపైనా చర్చించినట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చూడండి:మరియుపోల్​పై రష్యా ఉక్కుపాదం.. 10 నిమిషాలకోసారి బాంబుల వర్షం

ABOUT THE AUTHOR

...view details