భారత్ పెట్టుబడులకు స్వర్గధామమని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. సౌదీతో అనుబంధం ఏళ్లనాటిదని.. రెండు దేశాల మధ్య దృఢమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు.
సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా రియాద్‌లో జరిగిన విదేశీ పెట్టుబడుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సదస్సునే "దావోస్ ఇన్ డిజర్ట్"గా పిలుస్తారు.
"అంకురసంస్థ నిర్వహణలో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉంది. భారత్‌లోని 2,3 స్థాయి నగరాల్లోనూ అంకురసంస్థలు వచ్చాయి. ప్రపంచ స్థాయిలో ఇవి పెట్టుబడులు పెడుతున్నాయి. వీటిల్లో పెట్టుబడులు పెట్టి మీరు లాభం పొందాలని ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నా.
భారత్‌లో గ్యాస్, చమురు రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. 2024 వరకు చమురు శుద్ధి, పైప్‌లైన్స్, గ్యాస్ టెర్మినళ్ల కోసం 100 బిలియన్ డాలర్లు సమకూర్చనున్నాం. సౌదీ ఆరాంకో పశ్చిమ తీర రిఫైనరీల్లో పెట్టుబడులు పెట్టనుండటం సంతోషంగా ఉంది. ఈ శుద్ధి కేంద్రం ఆసియాలోనే అతిపెద్దది కానుంది."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారు అయిన భారత్.. 83శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం మౌలిక సదుపాయాలను సమకూర్చుకునే దిశగా భారత్ కృషి చేస్తోందని తెలిపారు.
సంబంధాల్లో నైపుణ్యమూ భాగమే..
స్కిల్ ఇండియా ద్వారా 40 కోట్లమందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. దీని ద్వారా భారత్‌లో ప్రారంభించబోయే అంకుర సంస్థల్లో మానవ వనరుల కొరత తీరుతుందని తెలిపారు. అంతర్జాతీయ సంబంధాలు కేవలం వస్తువుల వరకు మాత్రమే పరిమితం కావద్దని.. మానవ వనరులు, నైపుణ్యం అందులో అంతర్గతం కావాలని ఆకాంక్షించారు.