తాలిబన్లు అఫ్గాన్ రాజధాని కాబూల్‌ను సమీపించారని మాట వినగానే.. కుర్రాళ్లు పరుగెత్తుకుంటూ ఇళ్లకు వెళ్లారు. తాము వేసుకున్న టీ షర్ట్, జీన్స్‌లను తీసివేసి సంప్రదాయ దుస్తులు ధరించారు. నగరంలోని ఓ బ్యూటీ పార్లర్ గోడపై ఉన్న మహిళ చిత్రంపై దాని యజమాని రంగు పూసి కనిపించకుండా చేశాడు. కాబూల్ విశ్వవిద్యాలయం విద్యార్థినులు తమ అధ్యాపకులకు తుది వీడ్కోలు చెప్పారు. ఇక తాము వచ్చే అవకాశం ఉండదేమోనని కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళలయితే ఇంట్లో నుంచి బయటకు రావడానికే భయపడ్డారు. వివిధ దేశాల రాయబార కార్యాలయాలన్నీ మూతపడుతుండడంతో ఏ దేశానికైనా వెళ్లి ఆశ్రయం పొందే వీలు కూడా లేకపోయిందనేది పలువురి ఆవేదన.
క్రూర పాలన
అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యం, ఆధునికత ఆశించినవారి కలలు కల్లలయ్యాయి. 1996-2001 మధ్య సాగిన తాలిబన్ల క్రూర పాలన వారి కళ్లముందు కదలాడింది. మహిళలు, స్థానిక మైనార్టీలు గత రెండు దశాబ్దాలుగా సాధించిన కాస్త అభివృద్ధి కూడా నాశనమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ తరం పూర్తిగా నష్టపోవాల్సి ఉంటుందని ఆవేదన కనిపిస్తోంది. కొత్త శకాన్ని, శాంతిని స్థాపిస్తామని తాలిబన్లు చెబుతున్న మాటలు వారిలో నమ్మకం కలిగించలేకపోతున్నాయి. తాలిబన్లు ఆక్రమించిన ప్రాంతాల్లో ఇప్పటికీ పాఠశాలలు, కార్యాలయాలను తెరవనే లేదు. మహిళలు ఎవరూ బయటకు రావడం లేదు. కనీసం మహిళా వైద్యులు కూడా రోడ్లపై కనిపించడం లేదు. 12 ఏళ్లు దాటిన బాలికలు పాఠశాలకు వెళ్లకూడదన్న ఆంక్షలను మళ్లీ అమలు చేస్తారేమోనన్న భయం కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వానికి, సైనికులకు మద్దతు ఇచ్చిన వారిలో భయం ఆవహించింది. వారికి ప్రాణహాని కలిగించబోమని తాలిబన్లు చెప్పినప్పటికీ నమ్మకం కుదరడం లేదు. ఘజనీ రాష్ట్రంలోని మలిస్థాన్ జిల్లాలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం పక్షాన నిలిచిన వారి వివరాలు సేకరించడంతో వణుకు మొదలయింది.