తజికిస్థాన్‌లో పర్యటిస్తున్న భారత విదేశీ వ్యవహారలశాఖ మంత్రి ఎస్. జైశంకర్.. సోమవారం ఆ దేశ రాజధాని దుషాంబేలో అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ గనీతో, ఇరాన్, టర్కీ విదేశాంగ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంగళవారం ఇక్కడ జరిగే 'హార్ట్ ఆఫ్ ఏసియా' సదస్సులో ఆయన పాల్గొంటారు. ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్‌తో మంచి చర్చ జరిగిందని చాబహార్ పోర్టు ప్రాజెక్టు, ద్వైపాక్షిక సహకారంపై మాట్లాడుకున్నామని జైశంకర్ ట్విట్టర్లో వెల్లడించారు. అంతకు ముందు ఆయన.. దుషాంబే-చోర్తుత్ జాతీయ రహదారి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. భారత సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్వో) ఇక్కడ చేపడుతున్న పనులు బాగున్నాయని కితాబిస్తూ ఆయన మరో ట్వీట్ చేశారు.
చాబహార్ రేవుతో వాణిజ్య సంబంధాల బలోపేతం
ఇరాన్ దక్షిణ తీరాన, సిస్థాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉన్న చాబహార్ రేవును భారత్, ఇరాన్, ఆఫ్గానిస్థాన్లు కలిసికట్టుగా నిర్మిస్తున్నాయి. ఇది తమ వాణిజ్య సంబంధాల బలోపేతానికి తోడ్పడుతుందని ఆ దేశాలు భావిస్తున్నాయి.