తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ హోటళ్లలో కరోనాను ఆటాడేస్తారు - covid-19 in israel

ఆ హోటళ్లలో వందలాది మంది అతిథులు.. ఎటు చూపినా కేరింతలు, తుళ్లింతలే.. పాడేవారు పాడుతుంటారు.. ఆడేవారు ఆడుతుంటారు.. నవ్వించేవారు నవ్విస్తారు.. అందరూ కలిసి తరచూ పార్టీలు చేసుకుంటారు.. ఈ కష్టకాలంలో.. అదీ లాక్‌డౌన్‌ వేళ.. భౌతికదూరాన్ని తోసిరాజని ఇంత కలివిడిగా గడుపుతున్నారా.. అవును నిజమే. ఆ అతిథులంతా కరోనా వైరస్‌ సోకిన వారు.. ఆ హోటళ్లు ఉన్నది ఇజ్రాయెల్‌ దేశంలో..!

Corona victims in Israel hotels
'కరోనా హోటళ్ల'లో వైరస్ బాధితుల తుళ్లింత

By

Published : May 1, 2020, 7:47 AM IST

కరోనాను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌ పెద్ద కసరత్తే చేసింది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రభుత్వం క్షుణ్నంగా పరీక్షలు చేయించింది. కరోనా లక్షణాలు లేని వారిని హోం క్వారంటైన్‌కు పంపింది. వైరస్‌ ఆనవాళ్లు కనిపించిన వందలాది మందిని ఆసుపత్రుల్లో చేర్చి వైద్య చికిత్సలు అందిస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి అమాంతం పెరిగింది. సమస్యను అధిగమించేందుకు ఓ చక్కని ఆలోచన చేసింది. అదే ‘కరోనా హోటళ్ల’ విధానం.

దేశంలో లాక్‌డౌన్‌ విధించడంతో హోటళ్లన్నీ ఖాళీ అయ్యాయి. వాటిని కరోనా రోగుల కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌(ఐడీఎఫ్‌)కు అప్పగించింది. ఈ విభాగం వారు ఆరోగ్య, రక్షణ మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేసేలా ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటికే దేశంలోని పది హోటళ్లను ఎంపిక చేసి... వాటిలో కరోనా రోగులను ఉంచుతున్నారు. టెల్‌ అవీవ్‌లోని డాన్‌ పనోరమా హోటల్‌లో ప్రస్తుతం 500 మంది బాధితులు ఉంటున్నారు. వారంతా స్వల్ప లక్షణాలు కలిగినవారే. వీరిని కరోనా బాధితులు అనికాకుండా ‘అతిథులు’ అని వ్యవహరిస్తుండటం విశేషం.

హాయిగా... జాలీగా...

ఈ హోటళ్లలో అందరూ వైరస్‌ సోకిన వారే కావడంతో... భౌతిక దూరం పాటించాల్సిన పనిలేకుండా హాయిగా గుంపులు గుంపులుగా పోగై కబుర్లాడుకుంటూ... చిన్నచిన్న పోటీలు పెట్టుకుంటూ, ఆటలు ఆడుకుంటూ గడిపేస్తున్నారు. అంతా సాయంత్రమయ్యే సరికి పైకప్పు మీదకు చేరుకుంటారు. ఆ హోటల్‌ మధ్యధరా సముద్రపు తీరం సమీపంలో ఉంటుంది. అలల మీదుగా వస్తున్న చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ మైమరచి పోతుంటారు. ఉత్సాహంగా నృత్యాలు, యోగ, వ్యాయామాలు చేస్తూ, చక్కని పోషకాహారాన్ని తింటూ గడిపేస్తున్నారు. దీనివల్ల తమకు కరోనా సోకిందన్న భయంగానీ, ఆందోళనగానీ వారిలో లేవని, వారి ముఖాల్లో సంతోషమే ఎక్కువగా కనిపిస్తోందని ఆ హోటళ్లలో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు.

వైద్యులే ఉండరు...

కరోనా హోటళ్లలో వైద్యులు ఎవరూ ఉండరు. బాధితులంతా స్వల్ప లక్షణాలు కలిగిన వారే కావడంతో వీరికి అత్యవసర చికిత్సలు చేయాల్సిన పనిలేకపోవడమే అందుకు కారణం. రోజువారీ వేసుకోవాల్సిన మందులను, ఆహారాన్ని అందించేందుకు కొందరు సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. కరోనా సోకకుండా వీరికి పీపీఈ కిట్లను అందించిన అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌

హోటళ్లలో ఉంటున్న వారిలో చైతన్యం వెల్లివిరుస్తోంది. డాన్‌ పనోరమా హోటల్‌లో ఉంటున్న కట్జావ్‌ అనే యువతి హెయిర్‌ స్టయిలిస్ట్‌. అవసరమైన వారికి ఉచితంగా క్షవరాలు చేస్తోంది. హాస్యనటి నోమ్‌సుస్టర్‌... జోకులతో నవ్విస్తూ సంతోషాన్ని పంచుతోంది. తాను కరోనా నుంచి బయటపడ్డట్లు పరీక్షల్లో తేలడంతో ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మహమ్మారిని ఎదుర్కొంటున్న తీరును తొలి నుంచీ చిన్నచిన్న వీడియోలు తీసుకున్న నోమ్‌సుస్టర్‌ వాటిని చక్కగా కూర్చి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

మేమే నయం

కరోనా సోకిన వారు ఆసుపత్రుల్లో... సోకని వారు ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారందరికంటే మేమే నయం. ఇక్కడంతా సందడే సందడి అంటూ హోటళ్లలో ఉంటున్న కొందరు సంబరంగా చెబుతున్నారు. వైద్య సిబ్బంది తరచూ పరీక్షలు చేసి వెళుతున్నారు. నెగెటివ్‌ వచ్చిన వారికి వీడ్కోలు చెబుతూ... జాగ్రత్తలు సూచిస్తూ ఇళ్లకు పంపుతున్నారు. ప్రతి హోటల్‌ ముందూ ఓ అంబులెన్స్‌ సిద్ధంగా ఉంటుంది. అతిథుల్లో ఎవరి పరిస్థితైనా విషమిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాటది. ఈ విధానంలో బాధితులు వేగంగా కోలుకుంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details