CJI Ramana on Arbitration: "నేను ప్రపంచంలో ఎక్కడికెళ్లినా.. భారత న్యాయవ్యవస్థ ఎంతమేర పెట్టుబడిదారులకు స్నేహపూర్వకమని అడుగుతుంటారు. దీనికి 'భారత న్యాయవ్యవస్థకున్న సంపూర్ణ స్వతంత్రతపై మీరు పూర్తి విశ్వాసం పెట్టుకోవచ్చు.. అంతర్లీనంగా దానికున్న రాజ్యాంగశక్తి అన్ని పక్షాలనూ సమానంగా చూస్తుంది' అన్నదే నేనిచ్చే సమాధానం" అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఫిక్కీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆధ్వర్యంలో శనివారం దుబాయ్‌లో 'ఆర్బిట్రేషన్ ఇన్ ద ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్' అంశంపై నిర్వహించిన నాలుగో అంతర్జాతీయ సదస్సులో సీజేఐ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత న్యాయవ్యవస్థ ఆర్బిట్రేషన్‌కు పూర్తి అనుకూలమని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే సమర్థవంతమైన వివాద పరిష్కార వ్యవస్థ ఉండాలన్నారు.
"నేను న్యాయవాద వృత్తి జీవితం ప్రారంభించిన 1980లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నాడు ప్రపంచ వాణిజ్య విలువ 2 లక్షల కోట్ల డాలర్లుంటే 2019 నాటికి 19 లక్షల కోట్ల డాలర్లను దాటిపోయింది. ఈ వృద్ధి మరింత వేగాన్ని సంతరించుకోనుంది. ఇదే సమయంలో పరస్పర ఆధారం పెరిగిపోవడం మనల్ని దుర్బలంగా మార్చింది. ప్రపంచంలో ఒక మూలన తలెత్తే సంక్షోభ ప్రభావం అన్నిచోట్లా పడుతోంది. అది సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన వివాద పరిష్కార యంత్రాంగాన్ని నెలకొల్పేటప్పుడు ప్రస్తుతం ఉన్న వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉమ్మడి లక్ష్యాన్ని సాధించే క్రమంలో విభిన్నమైన ప్రయోజనాల మధ్య సమతౌల్యం సాధించడం పెద్ద సవాల్. దీన్ని అధిగమించేందుకు ఇలాంటి సదస్సులు ఎంతో ప్రయోజనకరం"
-జస్టిస్ ఎన్.వి.రమణ, సీజేఐ
ప్రస్తుత ప్రపంచానికి ఆర్బిట్రేషనే అత్యుత్తమ వివాద పరిష్కార యంత్రాంగమని జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టంచేశారు. ఇందులో నిబంధనల సరళత (ప్రొసీజరల్ ఫ్లెక్సిబిలిటీ), నిపుణుల భాగస్వామ్యం ఉంటుందని.. ఇది నిర్దిష్ట సమయాన్ని అనుసరించి కొనసాగే యంత్రాంగం కాబట్టి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందన్నారు.
దేశమంతటా వివాద పరిష్కార సంస్థలు..