ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 11,737 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒక్కరోజే 500 మందికిపైగా మృతిచెందారు. అత్యధికంగా స్పెయిన్‌లో 285 మరణాలు నమోదయ్యాయి. మొత్తం 2.87 లక్షల మందికిపైగా వైరస్ సోకగా.. ఈ ఒక్కరోజే 11వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా స్పెయిన్‌లో కొత్తగా 3,855, జర్మనీలో 1,804, ఇరాన్‌లో 966, బెల్జియం, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, అమెరికాలో 500లకుపైగా కేసులు వెలుగుచూశాయి.
పలు దేశాల్లో పరిస్థితి..
ప్రపంచంలోని 184దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మరి అనేక దేశాల్లో మృత్యుఘంటికలు మోగిస్తోంది. వైరస్‌కు కేంద్రమైన చైనాలో పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చినా.. ఇతర దేశాలపై మాత్రం అధిక ప్రభావం చూపుతోంది.
- మరణాల సంఖ్యలో చైనాను దాటేసింది ఇటలీ. మొత్తం 47,021 కేసులు నమోదు కాగా 4,032 మంది మరణించారు. 5,129 మంది కోలుకున్నారు.
- స్పెయిన్‌లో ఇవాళ అత్యధిక మరణాల సంఖ్య నమోదైంది. ఒక్కరోజే 233మంది మృతి చెందగా.. మొత్తం సంఖ్య 1,326కు చేరింది.
- ఇరాన్‌లో శనివారం ఒక్కరోజే 123మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,556కు పెరిగింది. ఇవాళ మరో 966 కొత్త కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 20,600 దాటింది. ఇరాన్‌లోని జోర్దాన్ 3 రోజుల పాటు బంద్ ప్రకటించింది సర్కారు. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే ఏడాది జైలు తప్పదని హెచ్చరించింది.
- బెల్జియంలో 558 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం సంఖ్య 2,815కు పెరిగింది.
- అమెరికాలో 20 మంది మృతి చెందగా మరణాల సంఖ్య 276కు చేరింది. మరో 392 కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 19వేలు దాటింది.
- దక్షిణ కొరియాలో తాజాగా 8మంది చనిపోగా మరణాల సంఖ్య 102కు పెరిగింది. 147 కొత్త కేసులతో కలిపి మొత్తం సంఖ్య 8వేలు దాటింది.
- ఇజ్రాయెల్‌లో కొత్తగా 178 కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 883కు పెరిగింది.
- సింగపూర్‌లో తొలిమరణం నమోదు.
- పాకిస్థాన్‌లో తాజాగా 33 కేసులు నమోదు కాగా... మొత్తం సంఖ్య 625కు పెరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలను రెండు వారాలపాటు రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం.
- మలేషియాలో కొత్తగా 153, ఆస్ట్రేలియాలో 140 , థాయ్‌లాండ్‌లో 89, ఇండోనేషియాలో 81 కేసులు నమోదయ్యాయి.
మూడో రోజూ సున్నా..
చైనాలో వరుసగా మూడోరోజు దేశీయంగా కొత్త కేసులు నమోదు కాలేదని అధికార వర్గాలు తెలిపాయి. తాజాగా 41కేసులు నమోదు కాగా వారంతా ఇతర దేశాలకు వారేనని పేర్కొన్నారు. అయితే హుబె రాష్ట్రంలో ఇవాళ ఏడుగురు మృతి చెందగా మరణాల సంఖ్య 3,255కు పెరిగింది.