ఇరాన్‌తో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో సైనిక శక్తిని పెంచేందుకు అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. గల్ఫ్ దేశాల్లో అదనంగా 1,500 మంది రక్షణ బలగాలను మోహరించేందుకు గురువారం నిర్ణయం తీసుకుంది పెంటగాన్. ఈ విషయమై అమెరికా చట్ట సభ కాంగ్రెస్‌కు సమాచారం అందించింది.
మధ్యప్రాచ్యంలో భారీగా బలగాల మోహరింపు: అమెరికా
ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యప్రాచ్య దేశాల్లో మరిన్ని బలగాలను మోహరించేందుకు అమెరికా సిద్ధమైంది. 1,500 మంది రక్షణ బలగాలను గల్ఫ్ దేశాలకు పంపే విషయమై కాంగ్రెస్ సభ్యులకు సమాచారం అందించింది అమెరికా రక్షణ విభాగం పెంటగాన్.
ఈ నిర్ణయంపై భిన్న స్వరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 10వేల మంది సైనికులను పంపించాలన్న ప్రణాళికలు ఉన్నా ఇంకా తుది నిర్ణయానికి రాలేదని రక్షణ విభాగ కార్యదర్శి ప్యాట్రిక్ షానన్ తెలిపారు.
రక్షణ బృందాల్లో ఓ గస్తీ విమానం, యుద్ధ విమానాలు, ఇంజినీర్లు, 600 మంది రక్షణ సిబ్బంది కలిగిన క్షిపణి రక్షక వ్యవస్థ ఉండనున్నాయి.
ముడి చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన ఇరాన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం... గల్ఫ్ ప్రాంతంలో బలగాలను మోహరించాలని నిర్ణయం తీసుకుంది.