xi jinping hong kong visit: కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ విదేశీ పర్యటనలు చేయలేదు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తొలిసారి ఆయన చైనా ప్రధాన భూభాగాన్ని దాటి బయటకు వచ్చి హాంగ్‌కాంగ్‌లో పర్యటించనున్నారు. అక్కడ హాంగ్‌కాంగ్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సంస్థ షిన్హువా ధ్రువీకరించింది. దీంతోపాటు ఆయన అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జులై 1వ తేదీ నుంచి హాంగ్‌కాంగ్ కొత్త నాయకుడిగా జాన్ లీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో జిన్‌పింగ్ పాల్గొంటారని ఆ వార్తాసంస్థ పేర్కొంది.
మరోపక్క హాంగ్‌కాంగ్ సీనియర్ అధికారులు కొవిడ్ బారిన పడ్డారు. దీంతో జిన్‌పింగ్ పర్యటన కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, హాంగ్‌కాంగ్ 25వ స్వాధీన దినోత్సవ వేడుకలు కావడంతో దీనికి చాలా ప్రాధాన్యముంది. 2019లో ఇక్కడ చెలరేగిన ప్రజాస్వామ్య మద్దతు ఉద్యమాన్ని అణచివేసి, ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత తొలిసారి ఏర్పడ్డ ప్రభుత్వ ప్రమాణ వేడుక కూడా ఉండటంతో మరింత ప్రతిష్ఠాత్మకంగా మారింది.