తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​పైనా జవహరీ కన్ను.. ఆ వర్గాలను రెచ్చగొట్టాలని చూసి... - al jawahiri

Al Jawahiri death: అల్​ఖైదా అధినేత అల్‌ జవహరీ మృతి భారత్‌కు అత్యంత ముఖ్యమైన అంశమేనని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల భారత్​పై జవహరీ ప్రత్యేకంగా దృష్టిసారించాడని, పలు వర్గాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడని అధికారులు పేర్కొన్నారు. జవహరీ అంతం కావడం మంచిదే అయినా.. ప్రస్తుతం తాలిబన్లతో భారత్‌ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

what it means for india of Al Qaeda chief al-Jawahiri death
what it means for india of Al Qaeda chief al-Jawahiri death

By

Published : Aug 3, 2022, 8:45 AM IST

Updated : Aug 3, 2022, 9:55 AM IST

Al Jawahiri death India: అల్‌ఖైదా అధినేత అల్‌ జవహరీని అమెరికా మట్టుబెట్టడం భారత్‌లోని అల్‌ఖైదా మద్దతుదారులు, అనుబంధ సంస్థలకు పిడుగుపాటు వంటిదేనని అధికారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో అల్‌ఖైదా అధినేతకు తాలిబన్లు ఏకంగా రాజధాని కాబూల్‌లో ఆశ్రయం కల్పించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇటువంటి సౌకర్యాలు ప్రధానంగా భారత్‌పై దాడులకు పాల్పడే ఉగ్ర సంస్థలకూ విస్తరించవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అల్‌ జవహరీ మృతి భారత్‌కు అత్యంత ముఖ్యమైన అంశమేనని చెప్పవచ్చు. ఇందుకు ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. అవి ఏమిటంటే..

హిజాబ్‌ వివాదం ప్రస్తావన
Al Jawahiri Hijab Video:ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఓ వీడియో సందేశంతో అల్‌ఖైదా అధినేత ప్రజల ముందుకు రాగానే భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఆ వీడియోలో అల్‌ జవహరీ మాట్లాడుతూ.. భారత్‌లోని హిజాబ్‌ వివాదాన్ని ప్రస్తావించాడు. ఇస్లాంపై దాడికి వ్యతిరేకంగా భారత ఉపఖండంలో మేధోపరంగా మీడియాను ఉపయోగించుకుని, యుద్ధభూమిలో ఆయుధాలతో పోరాడాలని ముస్లింలను కోరాడు.

తాను సజీవంగా ఉన్నానని, భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నానని రుజువు చేసేందుకు వీలుగా కొన్ని అంశాలను ప్రస్తావించాడు. అతివాద హిందూ పురుషుల గుంపు వేధింపులను ధైర్యంగా ఎదురించిన ముస్లిం విద్యార్థిని మస్కాన్‌ ఖాన్‌ జిహాద్‌ స్ఫూర్తిని రగిలించిందని ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె చర్య తనను ఓ కవిత రాసేంతలా ప్రోత్సహించిందని చెప్పాడు. "నేను కవిని కాకున్నా.. కొన్ని లైన్ల కవిత రాసేలా ఆమె చర్య నన్ను ప్రోత్సహించింది. మా గౌరవప్రదమైన సోదరి నా నుంచి ఈ పదాల బహుమతిని స్వీకరిస్తుందని భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు.

జిహాదీ కార్యకలాపాలకు పిలుపు
అల్‌-ఖైదా భారత్‌లో నియామక ప్రక్రియలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ వీడియోను పరిశీలించిన భారత సంస్థలు భావించాయి. వాస్తవానికి అల్‌ జవహరీ గతంలోనూ చాలా వీడియోలు విడుదల చేశాడు. వాటిలో ప్రధానంగా పాశ్చాత్య శక్తులపై ఇస్లాం ప్రకటించిన యుద్ధంపైనే అతను ప్రధానంగా దృష్టి సారించేవాడు. భారత్‌ను అక్కడక్కడా చిన్నగా మాత్రమే ప్రస్తావించేవాడు. అందులో కశ్మీర్‌ అంశమే ఎక్కువగా ఉండేది. అంతేతప్ప ప్రత్యేకంగా దేశంలో చోటుచేసుకున్న ఏ ఘటననూ ఉదాహరించేవాడు కాదు. ప్రపంచవ్యాప్తంగా అల్‌ఖైదా బలహీనం అవడం, వివిధ దేశాల్లోని దాని శాఖలు భీకరమైన దాడులు చేపట్టలేకపోతుండడంతో.. ప్రపంచ జిహాదీ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు పెద్దగా ఉత్సాహం చూపని భారతీయ ముస్లింలకు పిలుపు ఇచ్చే ప్రయత్నమే జవహరి విడుదలచేసిన వీడియో అని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.

తాలిబన్‌లతో చెట్టపట్టాల్‌
కాబూల్‌లో అల్‌ జవహరీని మట్టుబెట్టడం అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ల యంత్రాంగానికి, అల్‌ఖైదాకు గల సంబంధాలను ధ్రువీకరిస్తోంది. "అఫ్గానిస్థాన్‌లో కొత్త పాలకుల (తాలిబన్‌ల) హయాంలో అల్‌ఖైదా విపరీతమైన స్వేచ్ఛను ఆస్వాదిస్తోంది. అదే సమయంలో దాని నిర్వహణ సామర్థ్యాలు మాత్రం పరిమితం. వచ్చే ఏడాది లేదా రెండేళ్లపాటు అఫ్గానిస్థాన్‌ వెలుపల పుంజుకోవడం లేదా నేరుగా దాడులు చేయడం వంటివి దాదాపు అసాధ్యం. సామర్థ్యం కొరవడడం, తాలిబన్ల నుంచి అడ్డంకులు వంటివి ఇందుకు కారణం కావొచ్చు" అని ఈ ఏడాది జూన్‌ నెలలో ఐరాస ఓ నివేదికలో పేర్కొంది. అల్‌ఖైదా ప్రాంతీయ శాఖైన అల్‌ఖైదా భారత ఉపఖండం (ఏక్యూఐఎస్‌) వద్ద 180 నుంచి 400 మంది ఫైటర్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. బంగ్లాదేశ్‌, భారత్‌, మియన్మార్‌, పాకిస్థాన్‌లకు చెందిన వీరంతా ఘాంజీ, హెల్మాండ్‌, కాందహార్‌, నిమ్రుజ్‌, పక్టికా, జబుల్‌ ప్రావిన్స్‌లలో శిక్షణ పొందుతున్నట్లు తెలిపింది.

మనం కన్నేసి ఉంచాల్సిందే
అల్‌ జవహరీని మట్టుబెట్టిన నేపథ్యంలో తాలిబన్లతో భారత్‌ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా వైదొలగిన అనంతరం, తాలిబన్‌లు పాలనా పగ్గాలు చేపట్టాక భారత ప్రభుత్వం ఆ దేశం నుంచి తన పౌరులు, అధికారులను దాదాపుగా పూర్తిగా వెనక్కి తీసుకొచ్చింది. అనంతరం అఫ్గాన్‌ పరిపాలనా యంత్రాంగానికి అత్యంత జాగ్రత్తగా చేరువైంది. అయితే జవహరి మరణంతో అఫ్గాన్‌లో ఉగ్రవాద మౌలిక వసతులు కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ మానవతా సాయం కొనసాగిస్తూనే అఫ్గాన్‌ భూభాగం నుంచి భారత్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టే ఉగ్రవాద కార్యకలాపాలపై కన్నేసి ఉంచాలి.

Last Updated : Aug 3, 2022, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details