What Israel Gain After War On Gaza :గాజాలో ఇజ్రాయెల్ దాడులు.. దాని తర్వాత పరిణామాలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. ఒకవేళ గాజాపై ఇజ్రాయెస్ సైన్యం పట్టు సాధిస్తే తర్వాత ఎలాంటి ప్రణాళిక అమలు చేయాలన్న దానిపైనా అగ్రరాజ్యం ప్రణాళికలు రచిస్తోంది. గాజాలో వివిధ రకాల పరిష్కారాలపై అమెరికా పలు సమీకరణలను పరిశీలిస్తోంది. తాజాగా గాజాను హమాస్ పట్టు నుంచి విడిపించిన తర్వాత ఎటువంటి వ్యూహం అనుసరించాలనే దానిపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సెనెట్ కేటాయింపుల కమిటీ విచారణలో వెల్లడించారు. జన సాంద్రతతో కిక్కిరిసిన గాజాలో హమాస్‌ను కొనసాగించడం సాధ్యంకాదని.. అలాగని ఇజ్రాయెల్‌కు గాజాలో పాలనపై ఆసక్తి లేదని బ్లింకెన్ తెలిపారు. ఈ రెండింటికి మధ్యే మార్గంగా ఉండే సమీకరణలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని చెప్పారు. గాజాలో పాలనకు ఒక దశలో పాలస్తీనా అథారిటీ సరిగ్గా సరిపోతుందనిపిస్తోందని.. కానీ అది అక్కడ మనుగడ సాగించగలదా అనేదే ప్రశ్నార్థకమని బ్లింకెన్ చెప్పారు.
మల్టినేషనల్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారా?
ఆంటోని బ్లింకెన్ మరికొన్ని అభిప్రాయాలను కూడా సెనెట్ కమిటీ ఎదుట వెల్లడించారు. గాజాలో ఏర్పడే తాత్కాలిక పాలనలో ఆ సరిహద్దులో ఉన్న దేశాలను భాగస్వాములను చేయవచ్చని కూడా బ్లింకెన్ వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థలను కూడా భద్రత, పాలనలో సహకరించడానికి ఆహ్వానించవచ్చని వివరించారు. బ్లింకెన్ వాదనల తర్వాత గాజాలో మల్టీ నేషనల్ ఫోర్సును ఏర్పాటు చేయవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు బ్లింకెన్ గురువారం ఇజ్రయెల్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. హమాస్ దాడులు చేశాక బ్లింకెన్ ఇజ్రాయెల్‌కు రావడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో నెతన్యాహు, బ్లింకెన్ మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.