Wagner Group Rebellion : ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాల్లో రష్యా ఒకటి. శక్తిమంతమైన దేశాధినేతల్లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. అలాంటి పుతిన్ ఆధిపత్యానికి తెరపడినట్లే అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కొలిక్కిరాకపోవడం, వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు, ఆ తర్వాతి పరిణామాలను చూస్తే రష్యా అధినాయకత్వంలో బలహీనతలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్‌పై ఎలాంటి చర్యలను పుతిన్ తీసుకోలేకపోవడమూ ఆయన బలహీన పడ్డారన్న వాదనలకు బలం చేకూరుస్తోంది.
Wagner Group Russia Chief : రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తాడని కిరాయి సైనిక ముఠా వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ అన్నా కూడా.. రష్యాధీషుడు పుతిన్ ఆయనతో సంధి చేసుకోవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తమకు అడ్డొచ్చిన ఎవరినీ వదలబోమని ముందుకు సాగిన ప్రిగోజిన్‌ను అరెస్టు చేయాలనీ, ఆయనకు మద్దతు ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన పుతిన్.. కేవలం 12 గంటల్లోనే రాజీకి ఓకే చెప్పారు. ఈ ఒప్పందం పుతిన్ బలహీనతకు దేశరక్షణ రంగ వైఫల్యానికి నిదర్శనమని అంతర్జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది. ప్రిగోజిన్ ప్రకటన అనంతరం దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన పుతిన్.. ఆ తర్వాత నోరు మెదప లేదు. దీన్ని బట్టి ఆయన గందరగోళ స్థితిలో పడ్డారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Prigozhin Wagner : సంధి ప్రకటన అనంతరం వాగ్నర్ కిరాయి సైనికులు రోస్టోవ్ నగరాన్ని వదిలి వెళుతున్న సమయంలో అక్కడి స్థానికులు పెద్ద ఎత్తున ప్రిగోజిన్‌తో సెల్ఫీలు దిగారు. ఆయన్ను ఓ కథానాయకుడిగా చూశారు. స్థానికుల్లో తిరుగుబాటుదారుడికి అంత మద్దతు లభించడం పుతిన్‌ను ఆందోళనకు గురిచేసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. రష్యా సైన్యం తీరు పట్ల గత నెల నుంచీ విమర్శలు చేస్తున్న ప్రిగోజిన్.. మరో విప్లవం తప్పదని హెచ్చరించినా.. తీవ్రతను పసిగట్టకపోవడం రష్యా రక్షణ రంగ వైఫల్యం అన్న వాదనలున్నాయి. ప్రిగోజిన్ రోస్టోవ్-ఆన్-డాన్ నగరంలో తిష్ట వేసుకు కూర్చునే వరకు రష్యా నిఘా వ్యవస్థ ఏం చేస్తోందో తెలియని పరిస్థితి.