తెలంగాణ

telangana

ETV Bharat / international

పుతిన్ నోట అణుబాంబు మాట! ఉక్రెయిన్​కు ముప్పు తప్పదా?

Putin nuclear bomb : ఉక్రెయిన్​పై రష్యా అణుదాడికి పాల్పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో అణ్యాయుధాల ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అణు బాంబుల దాడి ఘటనను పుతిన్​ తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అసలేమన్నారంటే?

putin
పుతిన్

By

Published : Nov 6, 2022, 6:55 PM IST

Putin nuclear bomb : ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు యత్నిస్తోన్న రష్యా.. అణ్వాయుధాలనూ ప్రయోగించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. తాజాగా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అణు బాంబుల దాడి ఘటనను తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌తో జరిపిన సంభాషణలో భాగంగా.. యుద్ధంలో గెలిచేందుకు ప్రధాన నగరాలపైనే దాడి చేయాల్సిన అవసరం లేదంటూ జపాన్‌పై జరిగిన అణు దాడులను పుతిన్‌ ప్రస్తావించినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది. ఖేర్సన్‌లోని నైపర్‌ నది పశ్చిమ తీరం నుంచి రష్యా దళాలు వెనక్కి వెళ్తాయనే హామీ కూడా ఇచ్చినట్లు తెలిపింది.

'జపాన్‌ లొంగిపోయేందుకు, రెండో ప్రపంచ యుద్ధం ముగింపునకు కారణమైన అణు దాడులు.. యుద్ధంలో గెలవడానికి ప్రధాన నగరాలపైనే దాడి చేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని చాటాయి' అని పుతిన్.. మెక్రాన్‌తో చెప్పినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు అణ్వస్త్రాలను ప్రయోగించాలన్న పుతిన్‌ ఆలోచనలను ఈ వ్యాఖ్యలు బలోపేతం చేస్తున్నాయని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ సేనల ప్రతిదాడులతో యుద్ధక్షేత్రంలో కొంతకాలంగా మాస్కోకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో.. రష్యాను కాపాడుకునేందుకు అన్ని వనరులను వినియోగిస్తామంటూ పుతిన్ ఇటీవల హెచ్చరించారు. ఆయన తాజా వ్యాఖ్యలనుబట్టి.. రష్యా అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా 1945 ఆగస్టులో అమెరికా.. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై రెండు అణు బాంబులను ప్రయోగించింది. ఈ దాడుల్లో లక్షలాది మంది మృతి చెందారు. దీంతో జపాన్ యుద్ధంలో లొంగిపోతున్నట్లు ప్రకటించింది. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగింది ఈ రెండు ఘటనల్లో మాత్రమే.

ఇవీ చదవండి:వాతావరణ మార్పులను ఈసారైనా 'కాప్‌' కాస్తారా?

బైడెన్‌కు కీలకంగా మధ్యంతర ఎన్నికలు.. అమెరికా ఏం తేల్చేను?

ABOUT THE AUTHOR

...view details