అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానాలు కూల్చివేసిన ఘటనపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నల్ల సముద్రంలో అమెరికా నిఘా డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానాలు కూల్చివేస్తున్న దృశ్యాలను పెంటగాన్ విడుదల చేసింది. అమెరికాకు చెందిన MQరీపర్- 9 డ్రోన్ వైపు రష్యాకు చెందిన రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు దూసుకొస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. డ్రోన్‌పై రష్యా విమానాలు వెళ్లినప్పుడు వీడియో ప్రసారానికి అంతరాయం కలిగింది. ఎస్‌యూ-27 యుద్ధ విమానం.. డ్రోన్‌పై ఇంధనాన్ని విడుదల చేయడం వల్ల డ్రోన్ దెబ్బతిందని పెంటగాన్ వివరించింది.
అయితే ప్రొపెల్లర్ ధ్వంసం కావడం వల్ల డ్రోన్‌ను అంతర్జాతీయ జలాల్లో కూల్చివేయాల్సి వచ్చిందని అమెరికా.. ఘటన జరిగాక వెల్లడించింది. రష్యాకు చెందిన రెండు సుఖోయ్-27 యుద్ధ విమానాలు.. తమ MQ-9 డ్రోన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించాయని అమెరికా తెలిపింది. అందులోని ఒక ఫైటర్ జెట్.. డ్రోన్ ప్రొపెల్లర్‌ను ఢీకొట్టిందని పేర్కొంది. అంతకుముందు ఫైటర్ జెట్లు డ్రోన్‌పై ఇంధనాన్ని కుమ్మరించాయని అమెరికా తెలిపింది. ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఘటనపై స్పందించిన రష్యా.. తమ యుద్ధ విమానాలు డ్రోన్‌ను ఢీకొట్టడం గానీ, కాల్పులు జరపడం గానీ చేయలేదని పేర్కొంది. తమ సరిహద్దులకు సమీపంలో ఎగిరిన డ్రోన్.. రష్యాలోకి చొచ్చుకొచ్చిందని తెలిపింది. రష్యా యుద్ధ విమానాలను అడ్డగించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి నీటిలో కూలిపోయిందని వెల్లడించింది.