అమెరికాలోని గురుద్వారాలో.. కాల్పులు కలకలం రేపాయి. కాలిఫోర్నియా శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో.. ఇద్దరు వ్యక్తులపై ఒకరిపై ఒకరు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో జరిగినట్లు వెల్లడించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా పోలీసులు వెల్లడించారు. అందులో ఒకరిని భారత సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించామని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగర్ కీర్తన్ వేడుకలు జరుగుతున్న గురుద్వారా పరిసరాల్లో.. మొదటగా ఇద్దరు వ్యక్తులు మధ్య చిన్న గొడవ స్టార్ట్ అయ్యింది. అనంతరం ఒకరికిపై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత అది కాల్పులకు దారితీసింది. ఒకరిపై ఒకరు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. అయితే, కాల్పులు ద్వేషపూరిత నేరానికి సంబంధించినవి కావని తెలిసిన వ్యక్తుల మధ్యే జరిగినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం దురుద్వారా ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. కాగా, సంతోషకరమైన రోజున ఈ ఘటన ఓ మరకలా పరిణమించిందని.. శాక్రమెంటో కౌంటీ పోలీసు అధికారి అమర్ గాంధీ అన్నారు.
రెచ్చిపోయిన ఖలిస్థానీ మద్దతుదారులు..
ఇటీవల, అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న తరణ్‌జిత్ సంధూతోపాటు సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారు. భారత రాయబార కార్యాలయం ముందు ఖలిస్థాన్ జెండాలతో ఆందోళన చేశారు. అంతకుముందు రాయబార కార్యాలయం ముందు భారత్‌కు చెందిన పాత్రికేయుడిపైనా దాడికి దిగారు. తొలుత దుషించి తర్వాత కొట్టినట్లు ఆ పాత్రికేయుడు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధికారులు.. సీనియర్ పాత్రికేయుడిపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలు ఖలిస్థానీల హింసాత్మక, సంఘ వ్యతిరేక ధోరణులను తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇదే కాకుండా కెనడా లండన్లోనూ ఖలిస్థానీ మద్దతుదారులు రెచ్చిపోయారు. భారత దౌత్య కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. ఈ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. కెనడాలోని భారత దౌత్య కార్యాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడిచేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశ రాయబారికి సమన్లు జారీచేసింది. పోలీసులు ఉన్నా భద్రతను ఎలా ఉల్లంఘిస్తారని.. దీనికి జవాబు ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. దాడిలో పాల్గొన్నవారిని గుర్తించి అరెస్ట్ చేయాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. ఖలిస్థానీ మద్దతుదారులు దాడుల వేళ.. భద్రతా కారణాలతో కెనడాలో భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ పాల్గొనాల్సిన కార్యక్రమం రద్దయింది.