తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఖజానా ఖాళీ! దివాలా తీసే ప్రమాదం.. ప్రపంచానికి సంక్షోభమే!

US debt ceiling 2023 : అమెరికా దివాలా తీయనుందా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండనుందా? రుణ గరిష్ఠ పరిమితి పెంచడానికి అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం లభించకపోతే ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తనున్నాయి? రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య సయోధ్య కుదరకపోతే పరిస్థితి ఏంటి? గతంలో అమెరికాలో ఎప్పుడైనా ఈ తరహా పరిస్థితి తలెత్తిందా? ఆ వివరాలను ఈ కథనంలో చూద్దాం.

us debt ceiling 2023
us debt ceiling 2023

By

Published : May 12, 2023, 10:35 PM IST

US debt ceiling 2023 : రుణ గరిష్ఠ పరిమితిని పెంచడానికి చట్టసభ ఆమోదం లభించకపోతే అమెరికా ఆర్థిక విపత్తును ఎదుర్కొనే ప్రమాదం ఉందని, ఇది అగ్రరాజ్యం దివాలా తీయడానికి దారితీయొచ్చని ఆ దేశ ఆర్థిక మంత్రి జానెట్‌ యెల్లెన్‌ ఇటీవల హెచ్చరించారు. దీని ప్రభావం కేవలం అమెరికాపైనే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగా ఉంటుందన్నారు. ఫలితంగా అమెరికా నాయకత్వ హోదా ప్రమాదంలో పడుతుందని... దేశంలో భద్రతా సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. యెల్లెన్‌ హెచ్చరించినట్లుగా అమెరికా ఖజానా కొన్ని వారాల్లో ఖాళీ కానుంది. దీన్ని తప్పించుకోవాలంటే మరిన్ని అప్పులు చేయడానికి వీలుగా రుణ గరిష్ఠ పరిమితిని పెంచేందుకు అమెరికా చట్టసభ అనుమతించాల్సి ఉంటుంది. లేదంటే అగ్రరాజ్యం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

US debt ceiling crisis : చెల్లింపులు చేయడానికి అమెరికా ప్రభుత్వం తీసుకునే రుణాలపై విధించిన గరిష్ఠ పరిమితినే డెట్‌ సీలింగ్‌గా వ్యవహరిస్తారు. అంటే ప్రభుత్వం ఈ పరిమితికి మించి అప్పులు చేయడానికి కుదరదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, సామాజిక భద్రత, మెడికేర్‌, కేంద్ర రుణాలపై వడ్డీలు, పన్ను రిఫండ్‌లు.. ఇలా అన్ని ఖర్చులు చెల్లింపుల కిందకు వస్తాయి. మరిన్ని అప్పులు చేసి నిధులను సమకూర్చుకునేందుకు అమెరికా చట్టసభ కాంగ్రెస్‌ తరచూ ఆమోదం తెలుపుతూ ఉంటుంది. ప్రస్తుతం డెట్‌ సీలింగ్‌ 31.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే ప్రభుత్వ అప్పుల మొత్తం ఇంత మొత్తాన్ని మించడానికి వీలులేదు. ప్రభుత్వం జనవరిలోనే ఈ పరిమితిని దాటేసింది. కానీ, దేశ ఆర్థిక శాఖ ప్రత్యేక చర్యల ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తూ వచ్చింది. ఇప్పుడు డెట్‌ సీలింగ్‌ను పెంచడం అనివార్యమైంది. ప్రతిసారి ఇది చాలా సులువుగా జరిగిపోయేది. కానీ, ఈసారి కాంగ్రెస్‌ ఆమోదం రాజకీయంగా కొంత సంక్లిష్టంగా మారింది.

రిపబ్లికన్లు ఓకే అంటారా?
US debt ceiling clock : ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు ఆధిపత్యం ఉంది. ఈ నేపథ్యంలో పరిమితిని పెంచాలన్న అధికార డెమోక్రాట్ల ప్రతిపాదనను రిపబ్లికన్లు అంగీకరించడం లేదు. ఖర్చులను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందని పక్షంలో బిల్లు నిలిచిపోతుంది. దీనిపై రాజకీయంగా వీలైనంత త్వరగా ఓ సయోధ్య కుదరాలి. లేదంటే సకాలంలో చెల్లింపులు చేయడం సాధ్యంకాదు. ఫలితంగా అమెరికా దివాలా తీయక తప్పదని నిపుణులు అంటున్నారు. అమెరికాతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పెనవేసుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ప్రపంచమంతా ఉంటుంది. గతంలో ఎప్పుడూ పరిమితి పెంచకపోవడం అనే పరిస్థితి తలెత్తలేదు. ఫలితంగా పరిణామాలు ఎలా ఉంటాయనేది కచ్చితంగా చెప్పడం కష్టం. కానీ, ఆర్థికంగా పెద్ద సంక్షోభం తలెత్తడం మాత్రం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, పింఛన్ల చెల్లింపులు నిలిచిపోతాయని హెచ్చరిస్తున్నారు. జాతీయ పార్కులు సహా ఇతర ఏజెన్సీలు మూతపడే ప్రమాదం ఉంది. చివరకు అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే వాతావరణ విభాగం సైతం అప్‌డేట్లు ఇవ్వడం ఆగిపోవచ్చని పేర్కొంటున్నారు.

జూన్‌ 1 నాటికి డెట్‌ సీలింగ్‌ పెంచకపోతే.. అమెరికా ప్రభుత్వం రుణాలు, వాటిపై వడ్డీని సకాలంలో చెల్లించడం కుదరదు. ఇది దివాలాకు దారితీస్తుంది. ఫలితంగా ఏజెన్సీలు అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ను తగ్గిస్తాయి. కొత్త రుణాలపై అధిక వడ్డీరేటు చెల్లించాల్సి వస్తుంది. సామాన్యులకు అందే లోన్‌లపై వడ్డీరేటు.. ప్రభుత్వం తీసుకునే రుణరేటుపైనే ఆధారపడి ఉంటుంది. ఫలితంగా రిటైల్‌ రుణాల రేట్లు కూడా పెరిగి సామాన్యులకు భారంగా మారతాయి. దీర్ఘకాలం ఈ పరిస్థితి కొనసాగితే స్టాక్‌ మార్కెట్లలో పతనం ప్రారంభమవుతుంది. మొత్తంగా ఆర్థిక వ్యవస్థ నాలుగు శాతం క్షీణించే ప్రమాదం ఉందని అంచనా. దీని వల్ల 70 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఉన్న వనరులతో వడ్డీ చెల్లించి ప్రభుత్వం దివాలాను తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Debt ceiling history : ఒకవేళ సీలింగ్‌ను పెంచడంపై రాజకీయంగా సయోధ్య కుదరకపోతే.. ఆర్థికశాఖ తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. తద్వారా దివాలా ముప్పును కొంతకాలం వాయిదా వేయగలుగుతుంది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లను ఆపాల్సి ఉంటుంది. పెట్టుబడులను వాయిదా వేయాల్సి వస్తుంది. కొన్ని రకాల పొదుపు, మదుపు పథకాల చెల్లింపులను నిలిపివేయాల్సి ఉంటుంది. 2011, 2013లోనూ ఇదే తరహాలో సీలింగ్‌ పెంచడానికి అనుమతి లభించలేదు. అప్పుడు ప్రభుత్వం ప్రత్యేక చర్యల ద్వారా దివాలాను తప్పించుకోగలిగింది. అంతలోనే కాంగ్రెస్‌ ఆమోదం లభించడంతో సమస్య సద్దుమణిగింది. ప్రత్యేక అధికారాల ద్వారా నెట్టుకొస్తున్నప్పటికీ.. డెట్‌ సీలింగ్‌ను పెంచడానికి కాంగ్రెస్‌ ఆమోదం లభించకపోతే ఆర్థికంగా గడ్డు పరిస్థితులు తప్పవు. కేంద్ర ప్రభుత్వ వ్యయం పూర్తిగా నిలిచిపోతుంది. లేదంటే పన్నులను భారీగా పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇది రాజకీయంగానూ తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది.

ABOUT THE AUTHOR

...view details