Ukraine Aid : రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరోసారి తన సాయాన్ని ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. దీర్ఘకాల ఆయుధ సాయం కింద అదనంగా 17వేల కోట్ల డాలర్లను అందించనున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ శుక్రవారం వెల్లడించింది. దీనికింద మరిన్ని పేట్రియాట్ క్షిపణులు, క్షిపణులు, హాక్ గగనతల రక్షణ వ్యవస్థ, చిన్నపాటి ప్యూమా డ్రోన్ల కొనుగోలుకు నిధులు అందుతాయి. శతఘ్ని గుళ్లు, లేజర్ గైడెడ్ రాకెట్లను సమకూర్చుకోవడానికి, శిక్షణ తదితర అవసరాలకూ ఈ సొమ్మును వెచ్చిస్తారు. ఇప్పటివరకు అనేక సార్లు ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది అమెరికా.
ఆగని డ్రోన్ దాడులు
మరోవైపు రష్యాపై డ్రోన్ దాడుల పరంపర కొనసాగుతోంది. నైరుతి రష్యాలోని వొరొనెజ్ నగరంలో ఓ ఎత్తైన నివాస భవనంపైకి తాజాగా ఓ డ్రోన్ దూసుకొచ్చింది. ఈ ఘటనలో భవనం దెబ్బతింది. కిటీకీల అద్దాలు పగిలిపోయాయి. ఆ గాజు పెంకులు గుచ్చుకోవడంతో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు.
పేల్చింది యుద్ధట్యాంకును కాదు.. ట్రాక్టర్‌ను!
ఉక్రెయిన్ వాడుతున్న 8 అత్యాధునిక లియోపార్డ్ యుద్ధట్యాంకులను పేల్చేశామంటూ రష్యా ఇటీవల చేసిన ప్రకటనలో వాస్తవం లేదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్యాంకుల కూల్చివేతకు సంబంధించి రష్యా విడుదల చేసిన ఓ వీడియోనే ఇందుకు కారణంగా వారు చూపిస్తున్నారు. కేఏ-52 ఎలిగేటర్ ఎటాక్ హెలికాప్టర్ నుంచి ట్యాంకుపైకి క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా తెలిపింది. అయితే- అందులో పేలిపోయినది యుద్ధట్యాంకు కాదని.. కేవలం సాధారణ ట్రాక్టర్ అని వీడియో విశ్లేషణలో తేలిందని అమెరికా నిపుణులు వెల్లడించారు.