బ్రిటన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్‌కు మరో సమస్య ఎదురైంది. పన్నుల విషయంలో సొంత పార్టీ నేతల నుంచే తిరుగుబాటు ఎదురైంది. దేశంలో పన్నులు అధికంగా ఉన్నాయని, వాటిని తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కన్జర్వేటివ్ వే ఫార్వార్డ్ గ్రూప్.. ఆర్థికమంత్రికి లేఖ రాసింది. ఈ లేఖపై 40 మంది టోరీ ఎంపీలు సంతకాలు చేశారు.
యూకేలో ప్రజలపై ప్రభుత్వం విధిస్తున్న పన్నులు అధికంగా ఉన్నాయని.. దేశంలో ఈ స్థాయిలో పన్నులు చూడటం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడేనని కన్జర్వేటివ్ ఎంపీలు ఆరోపించారు. "జీవన వ్యయ సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్న మా నియోజకవర్గ ప్రజలకు మేం భరోసా ఇవ్వగలగాలి. పన్ను చెల్లింపుదారుల డబ్బు నుంచి ఖర్చు చేసే ప్రతి పైసాకు విలువ ఉండాలి. ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి. పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయకుండా సమర్థంగా ప్రజా పథకాలకు వినియోగించాలి. ప్రజలపై పన్ను భారం తగ్గించాలి’’ అని ఎంపీలు కోరారు.