తెలంగాణ

telangana

ETV Bharat / international

కోర్టుకు ట్రంప్​! అమెరికాలో హైఅలర్ట్‌.. ఏం జరగనుంది? - ట్రంప్ నేరారోపణ

లైంగిక సంబంధం బయట పెట్టకుండా శృంగార తారకు డబ్బు చెల్లించిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరికొన్ని గంటల్లో అరెస్టయ్యే అవకాశం ఉంది. న్యూయార్క్‌ మన్‌హట్టన్‌ కోర్టులో ట్రంప్‌ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయనపై రాతపూర్వక నేరాభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. ట్రంప్‌ కేసు దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా న్యూయార్క్‌ సహా అమెరికాలోని పలు నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

trump-surrender-and-appear-in-court-stormy-daniels-donald-trumpindictment
ట్రంప్ స్టార్మీ డేనియల్స్

By

Published : Apr 4, 2023, 6:43 PM IST

పోర్న్‌స్టార్‌కు చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరికొద్ది గంటల్లో కోర్టు ముందు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టులో ట్రంప్‌ను రహస్యంగా విచారించనున్నట్లు న్యూయార్క్‌ సుప్రీంకోర్టు జడ్జి జుయాన్‌ మెర్చన్‌ వెల్లడించారు. మీడియా అవుట్‌లెట్లు, టీవీ కెమెరాలను కోర్టు లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఓ శృంగార తార నోటికి తాళం వేయడానికి ఆమెకు డబ్బు ముట్టజెప్పిన కేసులో ట్రంప్‌ పై క్రిమినల్‌ అభియోగం మోపాలని గత గురువారం మన్‌హటన్‌ గ్రాండ్‌ జ్యూరీ నిర్ణయించింది. ఈ ఆరోపణకు ట్రంప్‌ మంగళవారం కోర్టులో తన వాదనను వినిపించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ట్రంప్‌ న్యూయార్క్‌ చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన న్యూయార్క్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మెర్చన్‌ ఎదుట హాజరై క్రిమినల్‌ విచారణను ఎదుర్కోనున్నారు. ఈ విచారణను ప్రసారం చేసేందుకు అనుమతినివ్వాలంటూ పలు అమెరికా మీడియా సంస్థలు కోర్టును అభ్యర్థించగా.. న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. విచారణ ప్రారంభం కావడానికి ముందు కోర్టు గది, ట్రంప్‌ ఫొటోలను తీసుకునేందుకు ఐదుగురు స్టిల్‌ ఫొటోగ్రాఫర్లకు మాత్రం అనుమతినిచ్చింది. విచారణ సమయంలో మాత్రం మీడియా కెమెరాలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది.

ట్రంప్​

ట్రంప్‌ ప్రస్తుతం మన్‌హటన్‌లోని ట్రంప్‌ టవర్‌లో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా కోర్టుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్లు ఆందోళన చేపట్టే అవకాశం ఉండటంతో మన్‌హటన్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ట్రంప్‌ కోర్టు విచారణ సందర్భంగా న్యూయార్క్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. కీలక ప్రదేశాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనేక వీధులను మూసివేయనున్నారు. ట్రంప్‌నకు మద్దతుగా జరిగే ఆందోళనల్లో ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే వారు ఎంతటివారైనా అరెస్టు చేశామని, శిక్షపడేలా చేస్తామని న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ హెచ్చరించారు.

ట్రంప్​నకు వ్యతిరేకంగా నిరసనలు

ట్రంప్‌ కోర్టుకు హాజరైన సమయంలో నిబంధనల ప్రకారం ఆయన ఫొటోలు, వేలిముద్రలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి విచారణల్లో నిందితులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొస్తారు. అయితే ట్రంప్‌ విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నట్లు సమాచారం. విచారణ సమయంలో ఆయన వెంట సీక్రెట్‌ సర్వీసు ఏజెంట్లను కూడా అనుమతించనున్నట్లు తెలుస్తోంది.

ట్రంప్ విమానం
న్యూయార్క్​ కోర్టు

2006లో ట్రంప్‌, తానూ ఓ కార్యక్రమంలో కలుసుకున్నామనీ, తరవాత హోటల్‌లో శృంగారంలో పాల్గొన్నామని స్టార్మీ డేనియల్స్‌ అనే శృంగార చిత్రాల నటి ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచాలంటూ ట్రంప్‌ న్యాయవాది మైకేల్‌ కోహెన్‌ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల ముందు డేనియల్స్‌కు డబ్బు ముట్టజెప్పారన్నది ఆరోపణ. ఇది నిజమేనని కోహెన్‌ ఒప్పుకున్నారు. దీంతో ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్‌ అభియోగం మోపాలని గ్రాండ్‌ జ్యూరీ నిర్ణయించింది. ఆయనపై చేసిన ఆరోపణలను సీల్డు కవరులో ఉంచారు. అందులో ట్రంప్‌పై 30 ఆరోపణలు ఉన్నట్లు సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ కథనం పేర్కొంది.

ట్రంప్​ మద్దతుగా అభిమానుల ప్రదర్శన

ABOUT THE AUTHOR

...view details