Social Media Viagra Challenge: వయాగ్రా పిల్స్.. శృంగార సమస్యలు ఉన్న వారికి పరిష్కారంగా వచ్చిన ఓ అద్భుతమైన ఔషధం. అయితే దీని కారణంగా 13 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఆన్లైన్ ఛాలెంజ్ పేరుతో విద్యార్థులంతా ఫ్రూట్ జ్యూస్లో వయాగ్రా పిల్స్ కలిపి తాగారు. ఈ ఘటన కొలంబియా కుకుటాలోని సాన్ బార్టోలోమ్ స్కూల్లో ఏప్రిల్ 5న జరిగింది.
బాధితులంతా 9వ తరగతి చదివే.. 14-15 ఏళ్ల వయసువారేనని స్థానిక మీడియా పేర్కొంది. ఆన్లైన్ ఛాలెంజ్లో భాగం కావాలని ఆరాటపడ్డ విద్యార్థులు.. పెద్దలు మాత్రమే వాడాల్సిన వయాగ్రా మాత్రల్ని భోజన విరామ సమయంలో జ్యూస్లో కలిపి తీసుకున్నట్లు తెలిపింది. నిమిషాల్లోనే వారిలో గుండె వేగంగా కొట్టుకోవడం సహా ఇతర సమస్యల్ని గుర్తించిన ఉపాధ్యాయులు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధితుల్లో ఇద్దరికి తీవ్ర లక్షణాలున్నాయని, మిగతావారిని డిశ్చార్జి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేసింది పాఠశాల యాజమాన్యం. సోషల్ మీడియాలో పిల్లల కదలికలపై దృష్టి సారించాలని, వాటికి దూరంగా ఉంచాలని హితవు పలికింది.