Terror Attack In Pakistan Today : పాకిస్థాన్‌లో వరుస ఉగ్రదాడులు కలకలం రేపుతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని మియన్వాలిలో గల వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి చేశారు. వెంటనే పాక్ సైన్యం స్పందించి కాల్పులు జరపడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదాలు హతమయ్యారని పాక్ ఎయిర్ ఫోర్స్- పీపీఎఫ్ వెల్లడించింది.
అయితే ఈ దాడులు తమ పనేనని ఉగ్రసంస్థ తెహ్రిక్ ఏ జిహాద్ ప్రకటించింది. ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి పలువురు ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున చొరబాటుకు యత్నించారని పీఏఎఫ్ ధ్రువీకరించింది. తాము అప్రమత్తమై ఆ దాడిని భగ్నం చేసినట్లు పేర్కొంది. తొమ్మిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కూడా చెప్పింది. ఈ ఘటనలో ఎయిర్‌బేస్‌లోని మూడు యుద్ధ విమానాలు, ఇంధన బౌజర్ ధ్వంసమయ్యాయని వెల్లడించింది.
శుక్రవారం కూడా..
మరోవైపు, పాకిస్థాన్‌లో శుక్రవారం కూడా ఉగ్రదాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో పోలీసు గస్తీ బృందాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబులతో దాడికిదిగారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా వీరిలో ఇద్దరు పోలీసులు. మరో 24 మంది గాయాలపాలయ్యారని ఓ అధికారి తెలిపారు. గతేడాది నవంబర్‌లో పాకిస్థాన్ ప్రభుత్వంతో తెహ్రిక్ ఏ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) కాల్పుల విరమణ ఒప్పందం పూర్తయినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాదం మళ్లీ ఊపందుకుంది. దీంతో పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాలు తీవ్ర ఉగ్రవాద దాడులను చవిచూస్తున్నాయి.
ఆత్మాహుతి దాడిలో 55 మంది బలి!
కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడికి 55 మంది బలయ్యారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. బలూచిస్థాన్ రాష్ట్రం మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు వద్ద ఈ పేలుడు జరిగింది. ఈ దాడిలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ నవాజ్ గాష్కోరి మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ ప్రవక్త జయంతి (ఈద్ మిలాదున్ నబీ) సందర్భంగా ర్యాలీ నిర్వహించేందుకు స్థానికులంతా జిల్లాలోని మదీనా మసీదు దగ్గర గుమిగూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డీఎస్పీ కారు దగ్గరగా వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. శక్తిమంతమైన బాంబు పేలుడు ధాటికి 55 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.