తెలంగాణ

telangana

ETV Bharat / international

15ఏళ్లుగా సిక్ లీవ్.. నెలకు రూ.4.6లక్షల జీతం.. అయినా ఇంక్రిమెంట్ కోసం కేసు.. చివరకు..

15 ఏళ్లుగా సిక్​ లీవ్​లో ఉంటూ.. నెలనెలా లక్షల్లో జీతం తీసుకుంటున్న ఓ వ్యక్తి.. తనకు ఉద్యోగం ఇచ్చిన సంస్థపై కోర్టుకెక్కాడు. తనపై వివక్ష చూపిస్తున్నారంటూ ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఎందుకా ఫిర్యాదు? చివరకు ఏమైంది?

ibm tech-worker-getting-54-thousand-pound-salary-without-work
సెలవుల్లో ఉండి రూ 55 లక్షల జీతం తీసుకుంటున్న ఉద్యోగి

By

Published : May 14, 2023, 7:55 PM IST

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15ఏళ్లుగా సిక్​ లీవ్! ఆఫీస్​కు అస్సలు రాకపోయినా.. 65 ఏళ్ల వయసు వచ్చేవరకు ఉద్యోగంలోనే కొనసాగిస్తామని హామీ!! ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉన్నా.. ఏడాదికి 54 వేల యూకే పౌండ్లు (రూ.55.3లక్షలు) వేతనం!!!.. అనారోగ్యంపాలైన ఓ ఉద్యోగికి ప్రముఖ టెక్ సంస్థ ఐబీఎం ఇచ్చిన ప్రత్యేక వెసులుబాటు ఇది. అయినా.. ఆ సంస్థపై కేసు వేశాడు ఆ ఉద్యోగి. 15 ఏళ్లుగా తనకు జీతం పెంచడం లేదని ఫిర్యాదు చేశాడు. చివరకు ఏమైందో తెలియాలంటే ఈ కథనం చివర వరకు చదవాల్సిందే.

2008 నుంచి..
సుదీర్ఘకాలంగా సెలవులో ఉన్న ఆ ఉద్యోగి ఇయాన్​ క్లిఫర్డ్. ఇంగ్లాండ్​ సర్రీలోని గిల్డ్​ఫోర్డ్ వాసి. లండన్​ కింగ్స్​ కాలేజీలో చదివాడు. 2000 సంవత్సరంలో లోటస్​ డెవలప్​మెంట్​ అనే సంస్థలో ఉద్యోగంలో చేరాడు. తర్వాత ఆ సంస్థను ఐబీఎం కొనుగోలు చేసింది. అలా ఐబీఎంలో ఉద్యోగిగా మారాడు ఇయాన్ క్లిఫర్డ్.

2008 సెప్టెంబర్​లో సిక్​ లీవ్​పై వెళ్లాడు ఇయాన్. ఐదేళ్లపాటు అలానే ఉద్యోగానికి దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో అతడి వయసు దాదాపు 35ఏళ్లు. 2013లో ఐబీఎంపై ఓ ఫిర్యాదు చేశాడు ఇయాన్. ఈ ఐదేళ్ల కాలంలో తన జీతం పెంచలేదని, హాలిడే అలవెన్సులు ఇవ్వలేదని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. 2013 ఏప్రిల్​లో ఐబీఎంకు, ఇయాన్​కు మధ్య రాజీ కుదిరింది. దాని ప్రకారం.. అతడ్ని ఐబీఎం డిసెబిలిటీ ప్లాన్​లో చేర్చేందుకు యాజమాన్యం అంగీకరించింది.

పని చేయకుండానే జీతం.. రిటైర్ అయ్యే వరకు..
ఐబీఎం డిసెబిలిటీ ప్లాన్ చాలా ప్రత్యేకమైంది. వైకల్యానికి గురైన ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ పథకం రూపొందించారు. దీని ప్రకారం.. అనారోగ్యం వల్ల పని చేయలేని స్థితిలో ఉన్న వ్యక్తిని ఉద్యోగం నుంచి తీసేయరు. అతడు లేదా ఆమె ఉద్యోగిగానే కొనసాగుతారు. పని చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా కోలుకునే వరకు లేదా రిటైర్ అయ్యే వరకు.. ఆ ఉద్యోగికి అప్పటివరకు అందిన జీతంలో 75శాతాన్ని ప్రత్యేక భృతిగా అందిస్తారు.

ఇయాన్ సిక్ లీవ్ పెట్టే సమయానికి అతడి వేతనం 72వేల పౌండ్లు. అందులో 75శాతం.. అంటే 54వేల పౌండ్లు వార్షిక వేతనంగా ఇచ్చేందుకు ఐబీఎం అంగీకరించింది. అలా ఇయాన్​కు 65 ఏళ్లు వచ్చే వరకు ఇస్తామని స్పష్టం చేసింది. అంటే.. దాదాపు 30 ఏళ్లకు కలిపి ఇలా ఇయాన్​ క్లిఫర్డ్​కు 15లక్షల పౌండ్లు అందుతాయి. అదే సమయంలో.. హాలిడే అలవెన్సులకు సంబంధించిన ఫిర్యాదునూ పరిష్కరించింది ఐబీఎం. 2013లోనే అతడికి 8,685 పౌండ్లు చెల్లించింది. అయితే.. జీతం పెంపు, హాలిడే అలవెన్సుల గురించి ఇంకెప్పుడూ అడగకూడదని అప్పుడే షరతు విధించింది.

న్యాయ పోరాటానికి దిగిన ఇయాన్..
ఇచ్చిన మాట ప్రకారం ఐబీఎం ఏటా ఇయాన్​కు 54వేల పౌండ్లు చెల్లిస్తోంది. అలా మొత్తం 15 ఏళ్లుగా సిక్​ లీవ్​లోనే.. ఐబీఎం ఉద్యోగిగా కొనసాగుతున్నాడు ఇయాన్. అయితే 2022లో అతడు మరోమారు న్యాయ పోరాటానికి దిగాడు. రీడింగ్​లోని ఎంప్లాయిమెంట్​ ట్రైబ్యునల్​ను ఆశ్రయించాడు. పాత వాదనల్నే మళ్లీ వినిపించాడు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోందని.. ప్రస్తుతం ఇస్తున్న 54వేల పౌండ్ల వేతనాన్ని పెంచాల్సిందేనని డిమాండ్ చేశాడు. 15 ఏళ్లుగా జీతం పెంచకపోవడం అంటే.. వికలాంగుడైన తన పట్ల వివక్ష చూపడమేనని వాదించాడు.

అయితే.. ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్​లో ఇయాన్​ క్లిఫర్డ్​కు గట్టి షాక్ తగిలింది. అతడి పిటిషన్​ను జడ్జి పాల్​ హౌస్​గో కొట్టేశారు. క్రియాశీల ఉద్యోగులకు వేతనం పెంపు ఉంటుంది కానీ.. ఇన్​యాక్టివ్​ ఉద్యోగులకు కాదని స్పష్టం చేశారు. జీతం పెంచకపోవడం.. వైకల్యం కారణంగా ఏర్పడ్డ అవరోధమే తప్ప వివక్ష కాదని తేల్చిచెప్పారు. ఇప్పటికే ఇయాన్​కు చాలా ఉదారంగా వార్షిక భృతి ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details