Mahinda Rajapaksa resign: శ్రీలంక ప్రజలు, ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి మహింద రాజపక్స వెనక్కితగ్గారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన రాజీనామా ప్రకటన చేసినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు అధికారులు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కర్ఫ్యూ అమల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు, దేశ రాజధాని కొలంబోలో జరిగిన నిరసనల్లో దాదాపు 23 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొలంబోలో సైన్యాన్ని రంగంలోకి దించారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న దేశంలో.. పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, అధికార నేతల రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే రాజీనామా ప్రకటన వెలువడింది. రాజీనామాకు ముందు మాట్లాడిన శ్రీలంక ప్రధానమంత్రి మహీందా రాజపక్స.. దేశ ప్రజల కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 9 నుంచి అధ్యక్ష కార్యాలయం వెలుపల నిరసన తెలుపుతున్న వారిపై రాజపక్స విధేయులు సోమవారం కర్రలతో దాడికి దిగారు. నిరసనకారులు ఏర్పాటు చేసుకున్న టెంట్లు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేయడానికి యత్నించడం వల్ల వారిని అదుపులోకి తెచ్చేందుకు.. పోలీసులు టియర్ గ్యాస్, జల ఫిరంగులు ప్రయోగించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్స.. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సంక్షోభ నివారణకు ఆర్థిక పరిష్కారం అవసరమని.. ఈ దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంలో జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో.. మహింద రాజీనామా చేసేందుకు ముందుకు వచ్చారు. దేశంలో కొనసాగుతున్న సంక్షోభానికి తన రాజీనామా ఒక్కటే పరిష్కారం అయితే.. అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రధాని రాజీనామాతో కేబినెట్ కూడా రద్దు కానుంది. కాగా, సోమవారం ప్రధాని రాజీనామా చేస్తారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అందుకు తగ్గట్టే నిర్ణయం వెలువడింది.
సంక్షోభ పరిస్థితులు ప్రారంభమైన నాటి నుంచి మహింద రాజపక్స ఆదివారం మొదటిసారి బహిరంగ ప్రదేశంలో దర్శనమిచ్చారు. అనురాధపురలో బౌద్ధాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన తెలియజేశారు. పవిత్ర ప్రదేశంలో దొంగలను నిషేధించాలంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీరు ప్రధానిగా దిగిపోతే.. మేం మీకు పూజలు చేస్తాం" అంటూ మరికొందరు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై రక్షణ శాఖ తీవ్ర ఆందోళ వ్యక్తం చేసింది. ఆందోళనకారులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని, అత్యవసర సేవలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ ఓ ప్రకటన వెలువరించింది.
శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన లంక క్యాబినేట్.. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న లంక.. నెల వ్యవధిలోనే రెండో సారి ఎమర్జెన్సీని విధించింది. 1948లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిన శ్రీలంక.. ఆర్థిక సంక్షోభానికి గురికావడం ఇదే తొలిసారి. ఆహార, ఇంధన, ఔషధాల కొరతపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండడం వల్ల శ్రీలంక అల్లాడుతోంది. మొత్తం 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేమని పేర్కొంది. సాయం కోసం పొరుగు దేశాలవైపు చూస్తోంది. భారత్ తన ఆపన్న హస్తాన్ని అందించి, క్లిష్ట సమయంలో తనవంతు సాయం చేస్తోంది.
ఇదీ చదవండి:గొటబాయకు షాక్.. 'ప్రభుత్వం' ఏర్పాటుకు ప్రతిపక్షం నో