srilanka crisis: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విల్లవిల్లాడుతున్న శ్రీలంకలో.. ఇంధన ధరలు చుక్కలను అంటుతున్నాయి. పెట్రోల్ ధరను 24.3 శాతం, డీజిల్ ధరను 38.4 శాతం మేర పెంచుతూ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో అధికంగా వినియోగించే ఆక్టేన్ 92 రకం పెట్రోల్‌పై లీటర్‌మీద 82 రూపాయలు పెంచింది. లీటర్ డీజిల్ ధరను 111 రూపాయల మేరకు పెంచారు. తాజా పెంపుతో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ 420 రూపాయలకు, లీటర్ డీజిల్ ధర 400 రూపాయలకు చేరింది. ఏప్రిల్ 19 తర్వాత శ్రీలంకలో ఇంధన ధరలు పెంచడం ఇది రెండోసారి.
ఇంధన కొరత కారణంగా పెట్రోల్ బంకుల వద్ద లంకేయులు బారులు తీరుతున్న నేపథ్యంలో శ్రీలంక సర్కారు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిర్ణయించింది. దీనితో పాటు రవాణా, ఇతర సర్వీసు ఛార్జీల సవరణకు శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంధన ధరల పెంపుతో ఆటోరిక్షా కార్మికులు సైతం రేట్లు పెంచనున్నట్లు ప్రకటించారు. మొదటి కిలోమీటర్‌కు 90 రూపాయలు, ఆపై ప్రతి కిలోమీటర్‌కు 80 రూపాయల మేరకు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.