Singapore New President :సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం (66) సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు. ఆయన విజయాన్ని ఎన్నికల కమిటీ ధ్రువీకరించింది. 2011 తర్వాత దేశంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరు చైనా సంతతికి చెందిన అభ్యర్థులను ఓడించి షణ్ముగరత్నం భారీ మెజారిటీతో గెలిచారు.
సింగపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో షణ్నుగరత్నానికి 70.4శాతం ఓట్లు పోలయ్యాయి. ఆయన ప్రత్యర్థులు ఎంగ్ కోక్‌సోంగ్, టాన్ కిన్ లియాన్‌లకు వరుసగా 15.7 శాతం, 13.88శాతం ఓట్లు వచ్చినట్టు ఎన్నికల కమిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 27 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు.
భారతీయ సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా..
Singarpore Presidential Elections 2023 : రిటర్నింగ్ అధికారి ప్రకటించిన ఈ ఫలితాలతో సింగపూర్‌కు భారతీయ సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నిక ఖరారైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ ఆయనను అభినందించారు. ప్రధాని లీ సారథ్యంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) ఈ ఎన్నికల్లో షణ్ముగరత్నంకు అండగా నిలిచింది. ప్రస్తుత అధ్యక్షురాలు హలీమా యాకూబ్ పదవీకాలం సెప్టెంబరు 13న ముగియనుంది.
తనపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తా
Tharman Shanmugaratnam Singapore : సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో గెలవడం పట్ల షణ్ముగరత్నం సంతోషం వ్యక్తం చేశారు. ఫలితాల అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. సింగపూర్‌వాసులు తనకు బలమైన ఆమోదం తెలిపారన్నారు. తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. "ఇది నాకు వేసిన ఓటు కాదు. సింగపూర్ భవిష్యత్తుకు, ఆశావాద దృక్పథానికి వేసిన ఓటు. ఆశావాద దృక్పథం, ఐక్యతే ప్రధానంగా నేను ప్రచారం చేశారు. సింగపూర్ వాసులు కోరుకున్నది కూడా ఇదేనని నేను నమ్ముతున్నాను" అని షణ్ముగరత్నం అన్నారు. తనపై సింగపూర్ వాసులు ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తానన్నారు.
మోదీ శుభాకాంక్షలు
Tharman Shanmugaratnam Modi : సింగపూర్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన భారత సంతతకి చెందిన షణ్ముగరత్నానికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "సింగపూర్ అధ్యక్షుడిగా మీరు ఎన్నికైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్-సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి నేను ఎదురు చూస్తున్నాను" అంటూ మోదీ ట్వీట్ చేశారు.