తెలంగాణ

telangana

ETV Bharat / international

11 ఏళ్ల న్యాయపోరాటం వృథా.. నాగేంద్రన్​కు సింగపూర్​లో 'ఉరి'

Nagaenthran dharmalingam: భారత సంతతికి చెందిన నాగేంద్రన్​ ధర్మలింగంను ఉరితీసింది సింగపూర్ ప్రభుత్వం. 2009లో డ్రగ్స్​ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన అతనికి మరణదండనను బుధవారం అమలు చేసింది. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని నాగేంద్రన్​ 11 ఏళ్లపాటు న్యాయపోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.

Ngaenthran dharmalingam latest news
11 ఏళ్ల న్యాయపోరాటం వృథా.. నాగేంద్రన్​కు సింగపూర్​లో ఉరి

By

Published : Apr 27, 2022, 1:12 PM IST

Ngaenthran dharmalingam latest news: ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని అతను 11 ఏళ్లుగా న్యాయపోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అతనికి క్షమాభిక్ష ప్రసాదించాలని అంతర్జాతీయ సమాజం ప్రాధేయపడినా లాభం లేకుండా పోయింది. మానసిక స్థితి సరిగా లేని తన బిడ్డను ఉరితీయొద్దని తల్లి జడ్జిల ముందు కన్నీరుమున్నీరుగా విలపించినా న్యాయస్థానం కనికరించ లేదు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో భారత సంతతికి చెందిన నాగేంద్రన్ కె.ధర్మలింగంకు బుధవారం ఉరితీసింది సింగపూర్ ప్రభుత్వం. ఈ విషయాన్ని అతని కుటుంబసభ్యులు వెల్లడించారు.

Nagaenthran singapore: నాగేంద్రన్ 2009లో అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో అరెస్టయ్యాడు. దోషిగా తేలిన అతనికి 2010లో అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. చాంగి జైలులో ఉంటూ అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాడు. నాగేంద్రన్ ఉరిశిక్ష రద్దుచేయాలంటూ మానవ హక్కుల సంఘాల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం దృష్టినీ ఆకర్షించింది ఈ కేసు. నాగేంద్రన్​ ఉరిశిక్ష రద్దు కోరుతూ గతేడాది అక్టోబర్ 29న ఆన్​లైన్ వేదికగా ప్రారంభమైన ఓ పిటిషన్​పై 56,134 మంది సంతకాలు చేశారు. నాగేంద్రన్ ప్రాణాలు కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు.

నాగేంద్రన్​కు మద్దతుగా జరిగిన నిరసనలు

వరుస తిరస్కరణలు:2009లో సింగపూర్​లోకి 42.72 గ్రాముల హెరాయిన్‌ను అక్రమ రవాణా చేస్తున్నాడనే అభియోగంపై నాగేంద్రన్‌కు 2010లో మరణశిక్ష విధించింది కోర్టు.

  • తనపై మోపిన నేరారోపణలను కొట్టేయాలంటూ కోర్టును ఆశ్రయించగా 2011-సెప్టెంబర్​లో అప్పీల్​ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
  • ఉరిశిక్షకు బదులుగా యావజ్జీవ కారాగారశిక్ష విధించాలని 2015లో నాగేంద్రన్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ దరఖాస్తును హైకోర్టు 2017లో కొట్టివేసింది.
  • 2019లో చేసుకున్న మరో అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ అప్పీల్‌ తిరస్కరించింది. చివరిగా క్షమాభిక్ష కోసం అధ్యక్షునికి పెట్టుకున్న అర్జీ సైతం తిరస్కరణకు గురైంది.

'మానసిక వైకల్యం లేదు..':నాగేంద్రన్ మానసిక స్థితి సరిగ్గా లేదని, ఉరిశిక్షను రద్దు చేయాలనే పిటిషన్​ కూడా దాఖలైంది. అయితే అతని ఆరోగ్య పరిస్థితి సరిగానే ఉందని.. చేసిన అప్పులు తీర్చేందుకు పూర్తి అవగాహనతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని హైకోర్టుతో పాటు అప్పీల్ కోర్టు సమర్థించింది. అతనితో బలవంతంగా ఈ పని చేయించారనే వాదనలను తోసిపుచ్చింది. దీంతో అతనికి నిరాశే మిగిలింది. అయితే అధికారులు నిర్వహించిన ఐక్యూ పరీక్షలో నాగేంద్రన్​ మానసిక స్థితి సరిగా లేదనే నివేదికలు బయటకు రావడం వివాదాస్పదమైంది.

'ఉరిశిక్ష రద్దు చేయండి..':తన ప్రియురాలిని చంపేస్తామని బెదిరించిన కొందరు.. నాగేంద్రన్​తో బలవంతంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేయించారని.. అందువల్ల దోషికి క్షమాభిక్ష ప్రసాదించాలని మానవహక్కుల కార్యకర్తలు కోర్టును అభ్యర్థించారు. అయినా ఫలితం లేకుండాపోయింది.

కరోనాతో ఆలస్యం:గతేడాది నవంబర్​ 10నే నాగేంద్రన్​ను ఉరి తీయాల్సి ఉంది. అయితే అతను కరోనా బారినపడటం వల్ల ఆలస్యమైంది. ఆ తర్వాత అతను ఉన్నత కోర్టులను ఆశ్రయించడం, దానిపై విచారణలు జరగడం వల్ల శిక్ష వాయిదా పడుతూ వస్తోంది. సోమవారం కూడా ఓ పిటిషన్ దాఖలు అయినప్పటికీ.. ఉరిశిక్షకు రెండు రోజుల ముందు పిటిషన్​ను స్వీకరించలేమని, చాలా ఆలస్యమైందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో నాగేంద్రన్​కు బుధవారం ఉరిశిక్ష అమలైంది.

ఇవీ చదవండి:భారత సంతతి వ్యక్తిని 'ఉరి' నుంచి కాపాడిన కరోనా!

'అన్నీ తెలిసే నేరం చేశాడు.. అతనికి 'ఉరి' తప్పదు'

ABOUT THE AUTHOR

...view details