తెలంగాణ

telangana

ETV Bharat / international

దోమలకు కొందరే ఎందుకు ఇష్టం?.. వారినే ఎందుకు టార్గెట్ చేస్తాయి?

దోమల సీజన్ వచ్చిందంటే చాలు అవి నరకం చూపిస్తాయి. చర్మంపై గుచ్చి రక్తం పీల్చడమే కాకుండా రకరకాల వ్యాధులు వచ్చేటట్లు చేస్తాయి. కొందరు మాత్రం ఈ కీటకాలకు లక్ష్యంగా మారుతుంటారు. అది ఎందుకు అలా చేస్తాయో ఓ సారి తెలుసుకుందాం.

Side Effects of Mosquito Bites
దోమలు

By

Published : Sep 13, 2022, 9:46 AM IST

దోమల సీజన్‌ వచ్చిందంటే నరకమే. చర్మంపై సూదుల్లా గుచ్చి రక్తం పీల్చడమే కాకుండా మనల్ని అనారోగ్యం పాల్జేస్తుంటాయి మశకాలు. వాటి దాడి నుంచి తప్పించుకోవడానికి జనం పడే పాట్లు అన్నీఇన్నీ కావు. కొందరు మాత్రం ఈ కీటకాలకు ఎక్కువ లక్ష్యంగా మారుతుంటారు. ఇది ఎందుకు? మనుషులవైపు దోమలు ఎలా ఆకర్షితమవుతాయి? ఇందుకు దోహదపడే అంశాలేంటన్నదానిపై కీటకాల నిపుణుల విశ్లేషణ ఇదీ..

కార్బన్‌ డైఆక్సైడ్‌, వాసన సంకేతాలు..
పగటివేళ రక్తాన్ని గుర్తించడానికి దోమలు దృష్టి, ధ్వని, వాసన సామర్థ్యాలను ఉపయోగించుకుంటుంటాయి. రాత్రిపూట మాత్రం పూర్తిగా వాసనపైనే ఆధారపడుతుంటాయి. ప్రధానంగా కార్బన్‌ డైఆక్సైడ్‌ను ఇవి పసిగడుతుంటాయి. మానవులు సహా వెన్నెముక జీవులన్నీ తమ శ్వాస ద్వారా ఈ వాయువును విడుదల చేస్తుంటాయి. దీని ఆధారంగా.. కొద్దిమీటర్ల దూరంలో ఉన్న మనుషులను ఈ కీటకాలు పసిగట్టగలవు. అయితే వాహనాలు వంటి నిర్జీవ వనరుల నుంచీ కార్బన్‌ డైఆక్సైడ్‌ విడుదలవుతుంటుంది. ఈ నేపథ్యంలో.. తాను పసిగట్టిన వాయువు ప్రాణుల నుంచి విడుదలైందా అన్నది నిర్ధారించుకోవడానికి అదనపు మార్గాలను దోమలు అనుసరిస్తుంటాయి. శ్వాస, కదలికలు వంటి జీవక్రియల ద్వారా ప్రాణుల నుంచి వెలువడే లాక్టిక్‌ ఆమ్లం, అమోనియా, ఫ్యాటీ ఆమ్లాల వాసనను ఇవి పసిగడతాయి. తద్వారా ఆ కార్బన్‌ డైఆక్సైడ్‌.. జీవుల నుంచే వచ్చిందని రూఢి చేసుకుంటాయి.

జీవక్రియ రేటును జన్యుపరమైన అంశాలు నిర్ధారిస్తుంటాయి. శారీరక చర్యల ఫలితంగా కూడా అది పెరుగుతుంటుంది. అందువల్లే.. పరుగులు తీసిన అథ్లెట్లు ఆ తర్వాత కూల్‌డౌన్‌ వ్యాయామాలు చేసేటప్పుడు ఎక్కువగా దోమల కాటుకు గురవుతుంటారు. గర్భిణుల్లో జీవక్రియ రేటు అధికంగా ఉంటుంది. అందువల్ల వారు కూడా ఈ కీటకాలకు లక్ష్యంగా మారుతుంటారు.

  • రక్తాన్ని గుర్తించడానికి సహజసిద్ధ వాసనలపై కూడా దోమలు ఆధారపడుతుంటాయి. ఉదాహరణకు అనాఫెలస్‌ దోమలు.. మనిషి పాదం నుంచి వెలువడే కొన్ని రకాల వాసనలకు ఆకర్షితమవుతుంటాయి. ఈ రకం కీటకాలు మనుషుల్లో మలేరియా వ్యాప్తి చేస్తుంటాయి. ఇళ్లల్లో రాత్రివేళ రక్తాన్ని పీలుస్తుంటాయి. అవి పాదాలపైనే కుడుతుంటాయి. కార్బన్‌ డైఆక్సైడ్‌ అధికంగా ఉత్పత్తయ్యే తలభాగం జోలికి వెళ్లవు. తద్వారా అవి బాధితుడికి నిద్రాభంగం కాకుండా చూస్తూ తమ పని సాఫీగా కానిచ్చేస్తుంటాయి.

దృశ్య సంకేతాలతో..
దోమలు పగటి వేళ దృశ్యపరమైన సంకేతాలను ఉపయోగించుకోవడం ద్వారా రక్తపు వనరును గుర్తిస్తాయి. ఈ కీటకాలు సాధారణంగా నేల నుంచి చాలా తక్కువ ఎత్తులో ఎగురుతుంటాయి. బాధితులను పసిగట్టడానికి ఈ లక్షణం వాటికి బాగా ఉపయోగపడుతోంది.

మానసిక అంశాలు..
కొందరు తమ చుట్టూ ఉండే దోమలను పెద్దగా పట్టించుకోరు. మరికొందరు మాత్రం.. తమను ఇబ్బందిపెడుతున్నది ఒక్కదోమే అయినా దాన్ని వెంటాడి చంపడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్ని దోమలు.. మనం చేత్తో చంపడానికి అనువుగా లేని శరీరం భాగాలపై వాలి రక్తాన్ని పీలుస్తుంటాయి. ఏడిస్‌ ఈజిప్టై రకం దోమలు.. మనిషి చీలమండల భాగాలను కుడుతుంటాయి.

రక్తం ఎందుకు?
దోమలు, నల్లులు వంటి కీటకాలు.. రక్తంలోని ప్రొటీన్‌ను ఉపయోగించుకొని అండాలను తయారుచేసుకుంటాయి. అందువల్ల ఆడ దోమలు మాత్రమే రక్తాన్ని పీలుస్తుంటాయి. మగ దోమలు మొక్కల్లోని తేనెను ఆహారంగా తీసుకుంటాయి. రక్తాన్ని వేగంగా, సమర్థంగా గుర్తించి, దాన్ని ఒడిసిపట్టి, క్షేమంగా వెనుదిరగడం కోసం ఆడ దోమలు కొన్ని అంశాలపై ఆధారపడుతుంటాయి.

ముదురు రంగులను దోమలను త్వరగా గుర్తిస్తాయి. లేత రంగులు పరిసరాల్లో కలిసిపోతుంటాయి. అందువల్ల మనం ధరించే దుస్తుల వర్ణం కూడా దోమలను ఆకర్షించే అంశం కావొచ్చు. దోమలు తమ చూపు ద్వారా కదలికలనూ పసిగట్టగలవు.

ఇవీ చదవండి:బ్రిటన్ రాణి రహస్య లేఖ.. 2085 వరకు తెరవడానికి వీల్లేదు.. ఎవరికి రాశారో తెలుసా?

'అమ్మ బాటలోనే నా పయనం'.. పార్లమెంట్​లో బ్రిటన్​ రాజు తొలి ప్రసంగం

ABOUT THE AUTHOR

...view details