కుల వివక్షను చట్టవిరుద్ధంగా ప్రకటించిన తొలి అమెరికా నగరంగా సియాటెల్ ఖ్యాతి గడించింది. సియాటెల్ నగరంలో వివక్ష వ్యతిరేక చట్టాల్లో కులాన్ని జోడించాలని ప్రవాస భారతీయురాలు, సియాటెల్ నగర కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ కౌన్సిల్‌లో ప్రతిపాదించారు. జాత్యహంకారం వంటి ఇతర రకాల వివక్షల కంటే కుల వివక్ష భిన్నంగా లేదని అందువల్ల దీనిని కూడా చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. క్షమా సావంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సియాటెల్ సిటీ కౌన్సిల్ 6-1 ఓట్లతో ఆమోదించింది. అమెరికాలో వివక్ష చట్టాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కులతత్వానికి సంబంధించిన చట్టాలు మాత్రం స్పష్టంగా లేవు.
అమెరికాలో కుల వివక్షపై ఉక్కుపాదం.. అలా చేసిన మొదటి నగరంగా సియాటెల్ - Kshama Sawant
అమెరికాలో చారిత్రక సందర్భానికి సియాటెల్ నగరం సాక్ష్యంగా నిలిచింది. కుల వివక్షను చట్ట విరుద్ధంగా ప్రకటించిన తొలి అగ్రరాజ్య నగరంగా సియాటెల్ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకుంది. సియాటెల్ వివక్ష వ్యతిరేక చట్టాల్లో ఇప్పుడు కుల వివక్ష కూడా చేరింది. ఈ నిర్ణయంతో అమెరికాలోని హిందువుల్లో కొన్ని కులాలకు వివక్ష నుంచి విముక్తి లభిస్తుందని సియాటెల్ కౌన్సిల్ వెల్లడించింది.
కుల వివక్షను చట్ట వ్యతిరేకంగా ప్రకటించడం వల్ల దక్షిణాసియా ప్రవాసులకు, ముఖ్యంగా భారతీయులు, హిందూ సంఘాల ముఖ్యమైన సమస్య పరిష్కారం లభిస్తుందని కౌన్సిల్ అభిప్రాయపడింది. కుల వివక్ష వ్యతిరేక పోరాటం అన్ని రకాల అణచివేతల వ్యతిరేక పోరాటంతో ముడిపడి ఉందని క్షమా సావంత్ తెలిపారు. కార్పొరేట్ కంపెనీలు, ఉద్యోగ కార్యాలయాల్లో దక్షిణాసియా అమెరికన్లు, వలస కార్మికులు కుల వివక్ష ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. భారత్‌లో 70 ఏళ్ల క్రితం కుల వివక్షను నిషేధించారని అయినా ఇప్పటికీ పక్షపాతం కొనసాగుతూనే ఉందని ఆమె గుర్తు చేశారు.
కుల వివక్షపై సియాటెల్ నగరం చారిత్రక నిర్ణయం తీసుకుందున్న క్షమా సావంత్. ఇక ఈ విజయాన్ని దేశవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అమెరికాతో సహా ప్రపంచంలో ఎక్కడా కుల వివక్షకు చోటు లేదని మరో నేత ప్రమీలా జయపాల్ అన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాటానికి 200 సంస్థలు మద్దతు తెలపగా అందులో 30 కంటే ఎక్కువ అంబేద్కరైట్ సంస్థలు ఉన్నాయి. అమెరికాలో ప్రవాస భారతీయులు రెండో అతిపెద్ద విదేశీ సమూహంగా ఉన్నారు. 2018 గణాంకాల ప్రకారం అమెరికాలో 42 లక్షల మంది భారత సంతతి ప్రజలు జీవిస్తున్నారు.