తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిక్స్‌ సహకారానికి పుతిన్‌ పిలుపు.. ఇజ్రాయెల్​పై జెలెన్​స్కీ గరం

ఉక్రెయిన్​కు అండగా నిలుస్తూ పశ్చిమ దేశాల స్వార్థపూరిత చర్యలను ఎదుర్కొనేందుకు సహకరించాలని బ్రిక్స్​ దేశాలకు పిలుపునిచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్. బ్రిక్స్​ 14వ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించారు. మరోవైపు.. ఇజ్రాయెల్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ.

BRICS
బ్రిక్స్‌ సహకారానికి పుతిన్‌ పిలుపు

By

Published : Jun 24, 2022, 5:04 AM IST

ఉక్రెయిన్‌ యుద్ధ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కీవ్‌కు అండగా నిలుస్తున్న పశ్చిమ దేశాల స్వార్థపూరిత చర్యలను ఎదుర్కొనేందుకు సహకరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల నేతలకు పిలుపునిచ్చారు. గురువారం వర్చువల్‌ వేదికగా నిర్వహించిన బ్రిక్స్‌ 14వ శిఖరాగ్ర సమావేశంలో ఆయన ప్రసంగించారు. రష్యాపై ఆంక్షలను ఉటంకిస్తూ.. 'కొన్ని దేశాల దుష్ప్రవర్తన, స్వార్థపూరిత చర్యల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం ఏర్పడింది. నిజాయతీ, పరస్పర ప్రయోజనకర విధానాలతో మనం ఈ స్థితి నుంచి బయటపడగలం' అని వ్యాఖ్యానించారు. పరస్పర సంబంధాలు మెరుగుపడేలా, బహుముఖ వ్యవస్థ స్థాపించేలా.. 'బ్రిక్స్‌'ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పుతిన్ అన్నారు.

ఇజ్రాయెల్​పై జెలెన్​స్కీ గరం.. రష్యాపై ఆంక్షల విధింపునకు ఇజ్రాయెల్ ముందుకు రాకపోవడాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి తప్పుపట్టారు. జెరూసలేంలోని హిబ్రూ యూనివర్సిటీ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిరాకరణపై మాట్లాడుతూ.. దురాక్రమణకు గురవుతున్న ఓ బాధిత దేశాన్ని ఎందుకు ఆదుకోలేరు? అని ప్రశ్నించారు. యుద్ధ సమయంలో రష్యాకు.. ఇజ్రాయెల్ ఏ విధంగా సహాయపడుతోందంటూ వస్తున్న ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదన్నారు. ఇజ్రాయెల్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ.. జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. త్వరలో ఇక్కడి నఫ్తాలి బెన్నెట్‌ నేతృత్వంలోని ప్రభుత్వం రద్దు కానున్న విషయం తెలిసిందే. బెన్నెట్ రష్యా దండయాత్రను బహిరంగంగా విమర్శించలేదు. ఇరు దేశాలతోనూ ఇజ్రాయెల్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details