Russian Opposition Leader Navalny In Jail : రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు, అవినీతి వ్యతిరేక ప్రచారకర్త అయిన అలెక్సీ నావల్నీకి 19 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్రవాద ఆరోపణలపై సరైన ఆధారాలు లేకుండానే నావల్నీని రష్యా కోర్టు దోషిగా తేల్చింది. వివిధ ఆరోపణలపై నావల్నీ ఇప్పటికే 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దీనికి ఇప్పుడు 19 ఏళ్ల జైలు శిక్ష అదనంగా పడింది.
Russian Opposition Leader Sentenced : నావల్నీని క్లోజ్డ్ డోర్ పద్ధతిలో కోర్టు విచారించింది. ఇలాంటి కేసుల్లో సాధారణంగా రోజుల తరబడి విచారణ జరుపుతారు. అయితే నావల్నీని కేవలం 10 నిమిషాల్లో దోషిగా న్యాయమూర్తి తేల్చి శిక్ష విధించారు. న్యాయమూర్తి శిక్ష విధించే సమయంలో నావల్నీ నవ్వుతూ కనిపించారు. మరోవైపు.. కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతామని అవినీతికి వ్యతిరేకంగా పోరాడినందుకే క్రెమ్లిన్ ఇలా చేస్తోందనినావల్నీ సన్నిహితులు తెలిపారు.
ఖండించిన అగ్రరాజ్యం..
నావల్నీకి జైలు శిక్ష విధించడాన్ని అమెరికా ఖండించింది. అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కుట్ర జరిగిందనీ క్రెమ్లిన్ నిజాన్ని ఎప్పటికీ నిశబ్ధంగా ఉంచలేదని పేర్కొంది. నావల్నీకి శిక్ష విధించడంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రష్యాలో రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయపరమైన వేధింపులకు గురిచేయడం ఆందోళనకర అంశమని పేర్కొంది.
Navalny VS Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్‌విధానాలను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న నేత అలెక్సీ నావల్నీ. ఆయన యాంటీ కరప్షన్ ఫౌండేషన్‌తోపాటు 'రష్యా ఆఫ్ ది ఫ్యూచర్' పార్టీ నేతగా ఉన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టారు. క్రెమ్లిన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఆయనకు మంచి ఆదరణ లభించింది.
Russian Opposition Leader Imprisoned : గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో నావల్నీపై విష ప్రయోగం జరిగింది. దాదాపు ఐదు నెలలపాటు జర్మనీలో చికిత్స పొందారు. పుతిన్‌పై పోరాటం ఆపేది లేదంటూ 2021 జనవరిలో తిరిగి రష్యాకు చేరుకున్న ఆయన్ను పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. వివిధ కేసుల్లో రెండున్నరేళ్లు, తొమ్మిదేళ్ల జైలు శిక్ష పడింది. తాజాగా మరో కేసులో 19 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.